ఇంటింటికీ
పోషకాహార
అవగాహన అవసరం
మహిళలను వేధిస్తున్న..
రాయగడ:
జిల్లాలోని మహిళల్లో విద్య, మొబైల్, ఇంటర్‌నెట్, బ్యాంకింగ్ వినియోగం గణనీయంగా పెరిగినా ఆరోగ్య పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో పోషకాహార లోపం, బాల్య వివాహాలు, కౌమర మాతృత్వం పెరుగుతుండటం జిల్లా ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. తాజాగా వెల్లడైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6) గణాంకాలు రాయగడ జిల్లాలో అభివృద్ధికి సంబంధించిన రెండు భిన్నమైన చిత్రాలను ఆవిష్కరించాయి. 2019–21లో జరిగిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5 తొ 2023–24లో జరిగిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6 గణాంకాలను పొల్చితే మహిళల సాధికారతకు సంబంధించిన అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. పదో తరగతి పూర్తి చేసిన మహిళల శాతం 19.1 నుంచి 24.8కు పెరిగింది. మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం 11.5 నుంచి ఏకంగా 42.7 శాతానికి పెరిగింది. మహిళల్లో మొబైల్, బ్యాంకింగ్ సేవల వినియోగం కూడా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఆరోగ్య రంగంలో కొన్ని ప్రతికూల పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో బాల్య వివాహాల శాతం 33.2 నుంచి 34 శాతానికి పెరిగింది. కౌమర మాతృత్వం 9.2 నుంచి 12.8 శాతానికి పెరగడం మరింత ఆందోళనకరంగా మారింది. కుటుంబ నియంత్రణ పద్ధతుల వినియోగం కూడా 72.7 నుంచి 64.6 శాతానికి తగ్గింది. మరొవైపు ఆస్పత్రుల్లో ప్రసవాల విషయంలో గణనీయమైన పురోగతి నమోదైంది. సంస్థాగత ప్రసవాలు 68.9 శాతం నుంచి 85.2 శాతానికి, ప్రసవానంతర సంరక్షణ 69.7 నుంచి 81.7 శాతానికి పెరిగాయి. పిల్లల పూర్తి టీకాకరణ కూడా 92.7 నుంచి 96.9 శాతానికి పెరిగింది. దీంతో మాతా, శిశు ఆరోగ్య సంరక్షణలో కొన్ని అంశాల్లో మెరుగుదల కనిపిస్తోంది.
చిన్నారుల్లో పోషకాహార లోపం
జిల్లాలో ప్రస్తుతం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం చిన్నారుల్లో పొషకాహార లోపం. పుట్టిన గంటలోపే తల్లిపాలు అందించే శాతం 74.5 నుంచి 6–.5 శాతానికి తగ్గింది. 6–23 నెలల చిన్నారులకు తగినంత ఆహారం అందుతున్న శాతం కూడా 24.7 నుంచి 17.9 శాతానికి పడిపొయింది. దీని ప్రభావం చిన్నారుల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం (స్టంటింగ్) 43.6 నుంచి 47.7 శాతానికి పెరిగింది. ఎత్తు–బరువుకు సంబంధించి తీవ్రమైన పోషకాహార లోపం 16.1 నుంచి 20.3 శాతానికి, తక్కువ బరువున్న పిల్లల శాతం 3.6 నుండి 7.5 శాతానికి పెరిగింది. మొత్తం మీద పోషకాహార లోపం 39.8 నుంచి 46.8 శాతానికి పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. మహిళల్లో మానసిక పరిశుభ్రతపై అవగాహన మాత్రం పెరిగింది. శానిటరీ పద్ధతులను పాటిస్తున్న మహిళల శాతం 63.5 నుండి 71.5 శాతానికి పెరిగింది. అయితే గర్భధారణ తొలి త్రైమాసికంలో వైద్య పరీక్షలు చేయించుకునే మహిళల శాతం 74 నుంచి 62 శాతానికి తగ్గడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
రాయగడ జిల్లా గిరిజనులు అధికంగా నివసించే జిల్లా కావడంతో పోషకాహార లోపం సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రులు, ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఇంటింటికీ పౌష్టికాహారంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక పోషకాహార పునరుద్ధరణ మిషన్ చేపట్టాలని సూచిస్తున్నారు. జిల్లా సామాజిక, సంక్షేమ శాఖ అధికారి మీనతి దేవ్ మాట్లాడుతూ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని తెలిపారు.


