కొరాపుట్: జయపూర్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సోమవారం విద్యుత్ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేశారు. టాటా పవర్ సంస్థ తన లాభార్జన కోసం విద్యుత్ ఉద్యోగులను బలి చేస్తుందన్నారు. ప్రతి మూడేళ్లకు విచక్షణా రహితంగా ఉద్యోగులను తొలగిస్తుందన్నారు. సీనియారిటీ పెరిగే కొద్ది ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు. కార్మిక హక్కులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి కాస్ట్ కటింగ్ పేరుతో సుమారు 300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు. అందులో 12 ఏళ్ల సీనియారిటీ ఉన్న వాళ్లని తొలగిస్తున్నారని, విధి నిర్వహణకు సొంత వాహనాలు వినియోగిస్తున్నా ఇంధనం కూడా ఇవ్వడం లేదన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని 12 రోజుల కిందట నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుత ఆందోళనలో కొరాపుట్, నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాలకు చెందిన సుమారు 800 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆందోళన విషయం తెలిసిన వెంటనే ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ మంత్రి రబినారాయణ నందో, పార్టీ కొరాపుట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా మిశ్రలు ఆందోళన వద్దకు చేరుకున్నారు. ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.


