రాయగడ: స్థానిక గాంధీనగర్ ప్రాంతంలో రెండు బైకులకు గుర్తు తెలియని దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న రెండు బైకులపై పెట్రోల్ పొసి దుండగుడు నిప్పంటించడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో గాంధీనగర్‌లో ఇంటి ముందు ఉన్న బైకుల నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు లేచి చూసేసరికి బైకులు తగులబడుతున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మేరకు బాధితులు సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొరాపుట్: అధికార బీజేపీ ప్రభుత్వానికి వరద బాధితులంటే చిన్నచూపని ప్రతిపక్ష యువ బీజేడీ ఉపాద్యక్షురాలు శిల్పా పాణీ ఎద్దేవ చేశారు. పకాలి తినడానికి ప్రభుత్వం తరఫున రూ. 1.5 కోట్లు కేటాయించిన సర్కార్ వరద నష్టానికి కేవలం రూ. 5 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని తప్పుబట్టారు. జయపూర్ పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు పకాలి దినోత్సవం రోజు ప్రముఖులు పకాలి తినడానికి రూ. 1.5 కోట్లు ఖర్చు చేశారని ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. కానీ నబరంగ్‌పూర్ జిల్లాలో ప్రభుత్వం తప్పిదంతో వరద నష్టం వచ్చిందన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రిజర్వాయర్ గేట్లు ఎత్తి వేయడంతో కృత్రిమ వరద వచ్చిందన్నారు. దీని వలన అనేక గ్రామాలు నీట మునిగాయన్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టపొయిందన్నారు. మేకలు, ఆవులు, పశుసంపద పోయిందన్నారు. వందల ఇళ్లు కుప్పకూలి పోయాయన్నారు. కానీ సీఎం వచ్చి నబరంగ్‌పూర్ జిల్లాలో అడుగు పెట్టకుండా వెళ్లి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత సీఎం కూడా నబరంగ్‌పూర్ జిల్లాకి వరద సహాయం రూ. 5 కోట్లు మాత్రమే సహాయం ప్రకటించారన్నారు. ఈ ప్రకటన చాలా నిందనీయం అన్నారు. నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన విద్యా మంత్రి నిత్యానంద గొండో పాఠ్యపుస్తకాలు ప్రచురణ కుంభ కోణం చేసి రూ. 380 కోట్లు అవినీతికి పాల్పడినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. కానీ సీఎం ఏదో దయ చూపి జిల్లాకి భారీ సహయం చేస్తున్నట్లు ప్రకటించుకున్నారని శిల్పా పాణీ ఎద్దేవా చేశారు.
స్థానిక మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయండి
సంజయ్ జైన్
కొరాపుట్: స్థానికంగా ఉండే మార్కెట్లలోనే వస్తువులను కొనగోలు చేయాలని జయపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అవిభక్త కొరాపుట్ జిల్లాలో అతి పెద్ద పట్టణమైన జయపూర్‌పై అనేక ప్రాంతాల జిల్లాల ప్రజలు ఆధార పడి ఉన్నారన్నారు. నిత్యం వేలాది మంది జయపూర్ వచ్చి కావాల్సిన వస్తువులను కొనగోళ్లు చేసుకునేవారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ బిజినెస్‌తో స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో తక్కువ ధరకి వస్తున్నాయని చెబుతున్నారన్నారు. కానీ స్థానిక ప్రజలు కూడా తక్కువ ధర కోసం డిమాండ్ చేయవచ్చన్నారు. వ్యాపారులు ఎప్పుడూ తమ బిజినెస్‌ను వదులుకోలేరన్నారు. స్థానికులు ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడం వలన ఇక్కడ డబ్బు బయటకు పోతుందన్నారు. కానీ ఇక్కడే కొనుగోళ్లు చేస్తే ఆ నగదు ఇక్కడే రొటేషన్ అవుతుందన్నారు. ఈ ప్రాంతంలో పండుగలు, ఉత్సవాలు, ఉపాధి అవకాశల కల్పనకు స్థానిక వ్యాపారులే సహాయం చేస్తారన్నారు. కానీ బయట వాళ్లు సహాయం చేయరన్నారు. మీరు కొనుగోళ్లు చేయడం వలన అనేక మందికి స్థానికంగా ఉపాధి లభిస్తోందని సంజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు.


