కొరాపుట్: ఈ నెల 8న జరిగే భారత బంద్‌ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. సోమవారం జయపూర్ పట్టణంలోని యాదవ్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జుదిష్ట రవులో ప్రసంగించారు. ఎంఎండీఆర్ బిల్లుకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్ కి మద్దతు ఇస్తున్నాయని గుర్తు చేశారు. కొరాపుట్ జిల్లాలో గనులన్నిటినీ ప్రభుత్వం అదానీకి కట్టబెట్టిందని తెలిపారు. పవిత్ర నాగేశ్వరి, బల్దా గుహలను కూడా గిరిజనులను బలి చేస్తూ అదానీకి అప్పగించారన్నారు. ఒడిశాకి చెందిన యువతులు ఉపాధి కోసం కేరళ వెళ్తుంటే గనుల కోసం అదానీ, అంబానీ, దాల్మీయాలు ఒడిశా వస్తున్నారని జుదిష్ట రవులో మండి పడ్డారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ మహంతి మాట్లాడుతూ ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అంటున్నారన్నారు. సీఈసీ జ్ఞానేష్ వ్యవహార శైలితో అనుమానాలు పెరిగాయని తెలిపారు. తక్షణం జ్ఞానేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారుల పాఠ్యపుస్తకాల ముద్రణలో వందల కోట్లు అవినీతికి పాల్పడిన మంత్రి నిత్యానంద గొండోని బర్తరఫ్ చేయాలన్నారు.


