పర్లాకిమిడి: పర్లాకిమిడి – రాణిపేట రోడ్డు గుమ్మగెడ్డ వద్ద శనివారం వేకువజామున అక్రమంగా నిల్వచేసిన మరో బాణసంచా గోదామ్‌లో ఆదర్శ పోలీసుస్టేషన్ సిబ్బంది సోదాలు చేసి విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రైల్వే గేటు వద్ద ఉన్న బాణసంచా గోడౌన్‌లో సోదాలు చేయగా సుమారు రూ.3 లక్షల విలువైన సామగ్రి లభించింది. ఈ గోదాము స్థానిక కొత్త బస్లాండ్‌కు చెందిన బల్ల మహేష్ కుమారుడు బల్ల వికాస్‌దిగా గుర్తించారు. నిల్వ ఉంచిన బాణసంచాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేనట్లు గుర్తించారు. దీంతో గోదాము సీజ్‌చేసి, కేసు నమోదు చేశారు.
ఆవిష్కార్ సీజన్–4 పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న ఆవిష్కార్ సీజన్–4కు సంబంధించి శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమాజానికి ఉపయోగపడేలా వినూత్నమైన ఆవిష్కరణలు రూపకల్పన కోసం ఆవిష్కార్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఐతం రైజ్ సీఈఓ బి.మనోజ్‌కుమార్, కన్వీనర్ జి.సతీష్‌కుమార్, కో–కన్వీనర్ పి.శిరీషా, శాక్ ఇన్‌చార్జి జె.సురేష్ పాల్గొన్నారు.
26న రెడ్ రన్
అరసవల్లి: హెచ్‌ఐవీపై అవగాహన కల్పించే క్రమంలో జిల్లా కేంద్రంలోని 80 ఫీట్ రోడ్డులో ఈ నెల 26న ఉదయం 5.30 గంటల నుంచి రెడ్ రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాఽధికారి డాక్టర్ నరేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7 వేలు వంతున బహుమతులు అందిస్తామని ప్రకటించారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 24లోగా 9494474206 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
శతాధిక వృద్ధురాలి మృతి
గార: బూరవెల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మళ్ల సరస్వతమ్మ (105) శనివారం మృతి చెందారు. ఈ వయసులోనూ తన పనులు తానే చేసుకునేవారని, ముందు రోజు అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపీపీ గొండు రఘురామ్, పార్టీ సీఈసీ సభ్యుడు గొండు కృష్ణమూర్తి తదితరులు సరస్వతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు.
బీఆర్‌ఏయూలో ఫేక్ ఆర్డర్ల కలకలం
● నియామకాలపై అనుమానాలు ● ఉద్యోగాల పేరుతో దందా
ఎచ్చెర్ల: ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ నియామక ఉత్తర్వులు చెలామణీ అవుతున్నాయన్న ప్రచారం విద్యార్థి, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. ఇక్కడ నిరుద్యోగులకు క్లర్క్, ఇతర పోస్టుల పేరుతో నకిలీ జాయినింగ్ లెటర్లు ఇస్తున్నట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియాలోనూ ఓ సర్క్యులర్ చక్కర్లు కొడుతోంది. అధికారిక ఈ మెయిల్ బదులు ప్రైవేటు ఈ మెయిల్ ఉండటం, అక్షర దోషాలు, ఫొటోలు అంటించడంతో ఇది నకిలీదే అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. అమాయక నిరుద్యోగల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఓ ముఠా ఇలాంటి నకిలీ ఆర్డర్లు సృష్టిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ నియామకాల ఆరోపణ
విశ్వవిద్యాలయంలో కొన్ని నియామకాలకు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలను ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గతంలో ఒక ఉన్నత ఉద్యోగి వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి చుట్టూ ఈ అనుమానాలు తిరుగుతున్నాయి. ఈ వ్యక్తి ప్రభావంతో కొన్ని నియామకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఫేక్ ఆర్డర్లపై విశ్వవిద్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసి అధికారిక ప్రకటన విడుదల చేయాలని, గత రెండేళ్లలో జరిగిన అన్ని తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ నియామకాలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని విద్యార్థులు కోరుతున్నారు.


