భువనేశ్వర్:
ఇటీవల ముగిసిన జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ఒడిశా పోలీసు క్రీడాకారులు వివిధ విభాగాల్లో విజేతలుగా రాణించారు. 12 మంది క్రీడాకారులు వివిధ అఖిల భారత స్థాయి పోటీలలో అద్భుతమైన విజయాన్ని సాధించి ఒడిశా పోలీసు విభాగం, రాష్ట్రానికి కీర్తిని సాధించారు. ఈ సందర్భంగా స్థానిక కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన ప్రత్యేక సత్కార కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విజేత క్రీడాకారులను సత్కరించారు. ఈ ఏడాది జూలై 23 నుండి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ (2026–27), జూలై 08 నుంచి11 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరిగిన 5వ సీనియర్ జాతీయ భారత తైక్వాండో పూమ్సే చాంపియన్ షిప్ 2026 పోటీలలో ఒడిశా పోలీసులకు చెందిన ఉషు, తైక్వాండో, కరాటే, పెంచక్ సిలాట్ జట్లుగా పాల్గొన్న క్రీడాకారులు వివిధ విభాగాలలో పతకాలను గెలుచుకున్నారు. వీరంందరినీ డీజీపీ అభినందించారు. వారి అసాధారణ ప్రతిభను, పట్టుదలను ప్రశంసించారు. క్రీడాకారుల విజయం ఒడిశా పోలీస్ దళానికి, యావత్ రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టిందని డీజీపీ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ క్రీడాకారులు ఒడిశా పోలీసుల ప్రతిష్టను మరింత పెంచుతారని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ రజత పతక విజేతకు రూ. 4,000, కాంస్య పతక విజేతకు రూ. 3,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
పతకాలు గెలుచుకున్న ప్రముఖ క్రీడాకారులు
డబ్ల్యూసీ/27 శాస్వతి నాయక్ (టైక్వాండో): 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్‌లో రజత పతకం,5వ సీనియర్ నేషనల్ టైక్వాండోలో కాంస్య పతకం.
సి/45 సత్యప్రకాష్ మహంతి (టైక్వాండో): 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ మరియు 5వ సీనియర్ నేషనల్ టైక్వాండో రెండింటిలోనూ కాంస్య పతకం.
కరాటే (11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్):
రజత పతకం విజేతలు: డబ్ల్యూసీ/968 బ్రతతి విశ్వప్రభా పతి (వ్యక్తిగత మహిళల విభాగం), సీ/136 రజనీ బిస్సి, సీ/159 డి. భగవాన్ రెడ్డి మరియు సీ/135 రితేష్ రే (వ్యక్తిగత పురుషుల విభాగం).
కాంస్య పతకం (వ్యక్తిగతం) విజేతలు: ఏఎస్‌ఐ(ఎ) యోగేష్ బొరిహా, డబ్ల్యూసీ/968 బ్రతతి విశ్వప్రభాపతి
కాంస్య పతకం టీమ్ విజేతలు:
●మహిళల టీమ్ : డబ్ల్యూసీ/968 బ్రతతి విశ్వప్రభ పతి, డబ్ల్యూసీ/397 అనుపమ స్వంయి, డబ్ల్యూసీ/168 మోనాలి సాహు, డబ్ల్యూసీ/389 సుష్మిని పలటాసింగ్.
●డబ్ల్యూసీ/397 అనుపమ స్వంయి, డబ్ల్యూసీ/395 సింధు తనయ ఖుంటియా మరియు డబ్ల్యూసీ/238 అనురాధ పాత్రో.
ఒడిశా పోలీస్ క్రీడాదికారి నీలమాధవ్ స్వంయి అధ్యక్షతన జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతక విజేతలుగా నిలిచిన పోలీసు సిబ్బంది సత్కార సభ కార్యక్రమానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) సంజయ్ కుమార్, కటక్, భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనర్ డాక్టర్ దేబ్‌దత్ సింగ్ హాజరై విజేత క్రీడాకారులను ప్రోత్సహించారు.


