భువనేశ్వర్: సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, పరిసర కాలి బాట ప్రాంతాలు హర హర మహాదేవ్ నినాదాలతో ప్రతిధ్వనించాయి. శ్రావణ మాసం పురస్కరించుకుని బోల్ భం దీక్షతో శివ భక్తులు కాలి నడకన ఒక ప్రాంతంలోని జలాశయం నుంచి సేకరించిన పవిత్ర జలంతో మరో జలాశయం తీరాన ఉన్న ఆలయంలో శివునికి అభిషేకించడం ఈ దీక్ష ఇతివృత్తం. దారి పొడవునా కావడి నేల మీద మోపకుండా సుదీర్ఘంగా పాద యాత్ర చేసి గమ్యం చేరడం వంటి కఠోర నియమాల్ని కట్టుదిట్టంగా ఆచరిస్తారు. శ్రావణ మాసం నెల పొడవునా ప్రతి సోమవారం శైవ క్షేత్రాల్లో మహా దేవునికి జలాభిషేకం చేయడం దీక్షగా కొనసాగిస్తారు. ఈ సందర్భంగా శైవ క్షేత్రాలు శివ నామ స్మరణతో మారుమోగుతాయి. ప్రధాన జలాశయాల తీరాల్లో నీట మునగడం వంటి ప్రమాదాల నివారణ దృష్ట్యా ఒడ్రాఫ్, అగ్ని మాపక దళం, పోలీసు దళాల్ని మోహరిస్తారు. లింగరాజ్, ధవళేశ్వర్ తదితర ప్రముఖ శైవ క్షేత్రాల్లో బోల్ భం దీక్షకుల సౌకర్యం కోసం ప్రత్యేక దర్శనం, జలాభిషేకం ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. వారి ఆగమనంతో శైవ పీఠాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి.


