రాయగడ: కాలువో పడి బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి లిటిగుడ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన దీనబంధు సియునా కొడుకు అలోక్ సియున (12)గా గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అలోక్ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలసి లిటిగుడ హరిశంకర్ వైవక్షేత్రం సమీపంలో కాలులోకి స్నానానికని దిగారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువవ్వడంతో పట్టుతప్పి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు గ్రామస్తులకు తెలియజేశారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం అలోక్ సియున మృతదేహం కాలులోని ఓ రాయి ఇరుకున కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటిలో దూరిన చిరుత పులి
కొరాపుట్: ఒక ఇంటిలోకి దూరిన చిరుత పులి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నబరంగ్‌పూర్ జిల్లా సరిహద్దులో సమీప చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేరిలో ఈ విచిత్ర ఘటన జరిగింది. వేకువ జామున ఒక ఇంటిలోకి చిరుత పులి ప్రవేశించింది. అక్కడ ఉన్న ధరం నేతం, గాంధీ నేతం అనే వ్యక్తులపై దాడి చేసింది. బాధితుల అరుపులతో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భయపడిన పులి వేరే గదిలోనికి దూరింది. వెంటనే గ్రామస్తులు ఆ గదిని మూసి వేశారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బాధితులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంతలో చేరుకున్న అటవీ సిబ్బంది పరిశీలించి చూడగా ఆ గదిలో చిరుత మరణించి పడి ఉంది. దీంతో కంగుతున్న సిబ్బంది పశుసంవర్ధక శాఖ సిబ్బందితో పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ పులి ఎలా చనిపోయిందో అధికారులు అయెమయంలో పడ్డారు. మరో వైపు ఆస్పత్రిలో బాధితులు కూడా తీవ్ర గాయాలపాలవ్వడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. పులిని పోస్టు మార్టం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే గానీ పులి మరణంపై స్పష్టత రాదని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
రాయగడలో 83 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లొ సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి 83 వినతులను స్వీకరించారు. ఇందులో 17 ఫిర్యాదులను అక్కడిక్కకే పరిష్కరించారు. స్వీకరించిన వినతుల్లో 58 వ్యక్తిగతమైనవి, 17 సామూహిక ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ నిధి నుంచి అవసరమైన ఎనిమిది మందికి 1.27 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మిగిలిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో అన్నాసాహెబ్ అహలే, ఎస్పీ రాజ్‌ప్రసాద్, ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్ కుమార్‌మ మిశ్రా, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి పాల్గొన్నారు.


