గగనతలంలో ముఖ్యమంత్రి.. వరద ప్రాంతాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

గగనతలంలో ముఖ్యమంత్రి.. వరద ప్రాంతాల పరిశీలన

Aug 2 2026 12:46 AM | Updated on Aug 2 2026 12:46 AM

గగనతలంలో ముఖ్యమంత్రి.. వరద ప్రాంతాల పరిశీలన

5 జిల్లాల్లోని 12కు పైగా మండలాలు ప్రభావితం

3 రోజుల్లోగా నష్ట నివేదికల దాఖలు

భువనేశ్వర్‌: రాష్ట్రంలోని 5 జిల్లాల్లోని 12కు పైగా మండలాల్లో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ గగనతలంలో శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రితో రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి, ప్రత్యేక సహాయక కమిషనర్‌ పాల్గొన్నారు. గగనతలంలో పరిశీలన అనంతరం విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వరద తాకిడి ప్రాంతాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయని తెలిపారు. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. రాబోయే రెండు రోజుల్లో వరద నీరు తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వరద తగ్గిన 3 రోజుల్లోగా నష్టాన్ని అంచనా వేసి వ్యవసాయం, ఇళ్ల నష్టాల ప్రాంతాల్లో తక్షణమే సహాయ ప్యాకేజీలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆకాశ మార్గం నుంచి ముఖ్యమంత్రి జాజ్‌పూర్‌ జిల్లాలోని దశరథ్‌పూర్‌, బొరి, బింఝార్‌పూర్‌, భద్రక్‌ జిల్లాలోని ధామ్‌నగర్‌, భండారీపొఖొరి, చాంద్‌బాలి, బాలాసోర్‌ జిల్లాలోని సొరొ, రెముణా, బాలాసోర్‌ సదర్‌, మయూర్‌భంజ్‌ జిల్లాలోని బొడొసాహి, ఉదొలా మరియు కప్తిపదర్‌లోని కొన్ని ప్రభావిత ప్రాంతాలు, కెందుఝొర్‌ జిల్లాలోని హట్టొడిహి మండలంలో ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సర్వే చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరద పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు, అధికారులతో సంప్రదించిన తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పూరీ జిల్లాలోని వరద పరిస్థితిని కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

అన్ని విపత్తుల నిర్వహణ తరహాలో తాజా వరద ముంపు సమయంలో కూడా శూన్య ప్రాణ హాని ప్రాధాన్యత కల్పించారు. కొనసాగుతున్న వరదల వల్ల 8 లక్షల మంది ప్రభావితం కాగా 2 లక్షల 69 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలలో 17 ఒడిశా విపత్తు నిరోధక దళాలు (ఓడీఆర్‌ఎఫ్‌), 7 జాతీయ విపత్తు సహాయక దళాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) మరియు 129 అగ్ని మాపక, అత్యవసర సేవల బృందాలు పాల్గొంటున్నాయి. 700 ఆశ్రయ కేంద్రాలు, సహాయక శిబిరాలలో బాధితులకు వసతి, పొడి, వండిన ఆహారం, తాగు నీరు, వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. ఈ జిల్లాలన్నింటిలో క్షేత్రస్థాయిలో సహాయక, పునరుద్ధరణ పనులను ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి వివరించారు. వరద బాధితులకు సహాయక, పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుండి రూ. 26 కోట్లు సహాయం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. బాధితులకు పాలిథీన్‌, పొడి, వండిన ఆహారం, తాగునీరు, మందులు పంపిణీ కొనసాగిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరదల తర్వాత ఆరోగ్య సమస్యలు రాకుండా కట్టుదిట్టమైన నిఘాతో యంత్రాంగం వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం సకాలంలో సమాచారం అందించడం, సరైన చర్యలు తీసుకోవడం వల్ల వరదల వల్ల కలిగే పెద్ద నష్టాన్ని నివారించగలిగామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement