మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి బి.ఎల్.పూర్ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే స్వయంగా గ్రీవెన్స్‌సెల్‌ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 28 వినతులు స్వీకరించారు. వాటిలో 27 గ్రామ సమస్యలు కాగా, ఒకటి వ్యక్తిగత సమస్యగా అధికారులు గుర్తించారు. గ్రామీణ సమస్యల్లో కొన్నింటి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటాని పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రీవెన్స్ వద్ద వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే స్థానికులతో సమస్యలపై చర్చించారు. అలానే జిల్లా పరిధిలోని మరో ఆరు పంచాయతీల్లో కూడా గ్రీవెన్స్‌ను నిర్వహించారు. కలిమెల సమితిలో గంపకొండ, పడియా పంచాయతీ కేంద్రంలో, కోరుకొండ సమితి సోమానాధ్‌పూర్, చిత్రకొండ సమితి బోడపోఢ పంచాయతీ, ఖోయిర్‌పూట్ సమితి కధమ్‌గూఢ, మాత్తిలి సమితి కత్తపల్లి పంచాయతీల్లో గ్రీవెన్స్‌ను నిర్వహించి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా వైద్యాధికారి డోలామాణి ప్రధన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు పాల్గొన్నారు.


