ఘనంగా గంతాయత్‌ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గంతాయత్‌ జయంతి వేడుకలు

Mar 29 2026 6:51 AM | Updated on Mar 29 2026 6:51 AM

పర్లాకిమిడి: స్థానిక ఒడ్డిమంగళి వీధిలోని ఉత్కళ హితేషినీ సాంస్కృతిక హాల్‌లో సీనియర్‌ జర్నలిస్టు, దివంగత నబీనానంద గంతాయత్‌ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉత్కళ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ద్విజేంద్రనాథ్‌ పాడి, కార్యదర్శి ప్రదీప్‌నాయక్‌, జర్నలిస్టు గరుఢ ధ్వజ చౌదరి, రఘురాజ్‌ రాజగురు, డాక్టర్‌ శంకర్‌ ప్రసాద్‌ భక్షి తదితరులు పాల్గొని మాట్లాడారు. నబీనా నంద గంతాయత్‌ కుమారుడు బిబేకానంద గంతాయత్‌ తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్రిక రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

రచయిత నాగరాజు దంపతులకు సన్మానం

రాయగడ: ప్రముఖ రచయిత, కవి, సీనియర్‌ పాత్రికేయుడు భళ్లమూడి నాగరాజు, శేషసాయి దంపతులను ఉత్కళ ఆంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. స్థానిక బాలాజీనగర్‌లోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు రేజేటి శ్రీనివాస్‌ శర్మ మాట్లాడుతూ.. నాగరాజు సమాజ వ్యవస్థాపక సభ్యులే కాకుండా.. కార్యదర్శిగా సేవలు అందించి ఉన్నతికి కృషి చేశారని తెలిపారు. అనివార్య కారణాలతో వారి కుటుంబం హైదరాబాద్‌ వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయనకు సాహితీరత్న, సాహితీ శిరోమణి వంటి బిరుదులు లభించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. నాగరాజు సతీమణి శేషసాయి రచయిత్రిగానే కాకుండా.. నటి, గాయకురాలిగా అందరికి సుపరిచితం అన్నారు. వేద పండితులు భాస్కరాచార్యులు, రేజేటి శ్రీనివాస్‌ శర్మ, కొల్లూరు గౌరి, శంకర్‌శాస్త్రి, పి.గణపతి శాస్త్రిలు వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఏవీ నారాయణ మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్లూరు సూర్యనారాయణ శర్మ, కోశాధికారి టీఎస్‌ఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సైబర్‌ నేరగాళ్లు అరెస్టు

మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు సైబర్‌ మోసంతో ప్రమేయం ఉన్నటువంటి ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ సమితి చితాపారి–3 పంచాయతీ సదాశివపూర్‌ గ్రామానికి చెందిన భీమ కిస్సానీ ఇంటి నుంచి ఈనెల 20వ తేదీ రాత్రి ఒక సెల్‌ఫోన్‌ చోరీకి గురయ్యింది. భీమ 23వ తేదీన బ్యాంక్‌కు వెళ్లినప్పుడు అతని ఖాతా నుంచి రూ.75 వేలు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే బలిమెల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐఐసీ దీరాన్‌ పట్నాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్‌ ట్రాకింగ్‌ ద్వారా నవరంగ్‌పూర్‌ జిల్లా డాబుగాం సమితి చాటిగుడా గ్రామానికి చెందిన దిలీప్‌ హరిజన్‌, ఇంద్రపాంకా అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.65 వేల నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. సోమవారం ఇద్దరినీ కోర్టుకు తరలిస్తామని ఐఐసీ దీరాన్‌ పట్నాయిక్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement