● ఐదుగురు దుర్మరణం
● 40 మందికి గాయాలు
భువనేశ్వర్: నయగఢ్ జిల్లా దసపల్లా హనుమాన్ ఘాటి సమీపంలోని కొండ ప్రాంతంలో పర్యాటక బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సు ప్రయాణికులతో నిండి ఉంది. ఈ ప్రమాదంలో 5 మంది దుర్మరణం పాలయ్యారు. 40 మందికి పైబడి గాయపడ్డారు. మా సింగేశ్వరి అనే పేరు కలిగిన ఈ ప్రైవేటు బస్సు బరంపురం నుంచి హరిశంకర్ ఆలయానికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద అదుపు తప్పి బండ రాతిని ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ధాటికి బస్సులోని పలువురు ప్రయాణికులు బయటకు తుళ్లిపడ్డారు. మరికొందరు బోల్తా పడిన బస్సులో చిక్కుకున్నారు. స్థానిక అధికారులు, నివాసితులు తక్షణమే రంగంలోకి దిగి సత్వర సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో డ్రైవర్, ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన ప్రయాణికుల్లో చాలా మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో గంజాం మరియు బరంపురం ప్రాంతానికి చెందిన 50 మందికి పైబడి యాత్రికులు ప్రయాణిస్తున్నారు.
పరిహారం ప్రకటన
దసపల్లా బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆర్థిక పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేసి, మృతులైన 5 మంది కుటుంబీకులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు.


