రారండోయ్‌ వేడుక చూద్దాం..! | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌ వేడుక చూద్దాం..!

Mar 29 2026 6:56 AM | Updated on Mar 29 2026 6:56 AM

రారండోయ్‌ వేడుక చూద్దాం..!

నేటి నుంచి మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు

ఐదు రోజులు జరగనున్న ఉత్సవాలు

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మందిరం పరిచాలన కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిలో భాగంగా మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మందిరం ప్రాంగణంతో పాటు అమ్మవారి గర్భగుడి, అమ్మవారిని పూలతో అలంకరించేందుకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి పూలను రప్పించారు.

పూజా కార్యక్రమాలు

చైత్రోత్సవాల్లో భాగంగా మందిరానికి సమీపంలోని జంఝావతి నది వద్ద ముందుగా పూజలను నిర్వహిస్తారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన శుద్ధ జలాలను మందిరంలో ఉంచడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈనెల 29వ తేదీన సాయంత్రం 6.48 గంటల నుంచి రాత్రి 9.17 నిమిషాల మధ్య తల్లి పాదాలు తీసుకొస్తారు. మందిరంలోనే ప్రత్యేక పూజలను నిర్వహించి ఈ పాదాలను తీసుకువచ్చి పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో నిలుపుతారు. అనంతరం అమ్మవారి ఘటాలను రూపొందిస్తారు. అదేరోజు ఉదయం 8.40 గంటలకు సూర్యపూజ, యజ్ఞశాల పూజ, ముఖ్య దేవత పూజ, చండీపాఠం, హారతి, పుష్పాంజలి పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం అగ్ని సంస్కార హోమం, హారతి, పుష్పాంజలి కార్యక్రమాలు ఉంటాయి. 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ప్రతి నిత్యం ఉదయం సూర్యపూజతో ప్రారంభమై మహాస్నానం, శాలపూజ, చండీపాఠం, దేవీ మహాస్నానం, షోడోపచార పూజలు కొనసాగుతాయి.

పూజల్లో ప్రధాన ఘట్టాలు

చైత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఐదు రోజుల్లో భాగంగా చివరి రోజు రాత్రి పూజారి మల్లెలు తొక్కడం (అగ్గిపై నడవడం), ముళ్లతో రూపొందించిన ఊయలలో పూజారి కూర్చుని ఊగడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అమ్మవారిని నిత్యం కొలిచే ఖండాయిత్‌ తెగకు చెందినవారు ఈ పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రధాన ఘట్టాలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అదేవిధంగా ఉత్సవ పూజల్లో భాగంగా చండీపాఠం, హోమం వంటి పూజలను నిర్వహించేందుకు గంజాం జిల్లా కవిసూర్యనగర్‌ నుంచి ప్రత్యేక పూజారుల బృందంను పరిచాలన కమిటీ రప్పిస్తారు.

అమ్మవారి ప్రత్యేక దినాలు

ప్రతినిత్యం పూజలు అందుకునే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజున అమ్మవారికి భోగం సమర్పించే సమయంలో ప్రత్యేకమైన వంటకాలను పూజారులు వండి సమర్పిస్తారు. పాయసం (ఖిరి), అన్నభోగం, పప్పు, కలగాయకూర, తోటకూర వంటివి అమ్మవారికి సమర్పించిన భోగంలొ ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం అమ్మవారికి అన్న భోగాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తులకు అమ్మవారిని దర్శనాన్ని సుమారు గంటపాటు నిలిపివేస్తారు. అనంతరం దర్శనం యథావిధిగా కొనసాగుతుంది.

సంధ్యా హారతి

ప్రతిరోజూ అమ్మవారికి సాయంత్రం సంధ్యా హారతి ని ఇస్తుంటారు. ఆదివాసీ మేళతాళాలు, డప్పులు వంటి వాయిద్యాల నడుమ హారతిని సమర్పిస్తారు. ఈ హారతిని తిలకిస్తే సర్వపాపాలు పోయి.. అంతా సుఖశాంతులతో ఉంటారని ఒక నమ్మిక కావడంతో భక్తులు హా రతిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

ఇత్తడి గుర్రం విశేషం

మందిరం ఎదురుగా ఇత్తడి గుర్రం ఉంటుంది. ఇది అమ్మవారి వాహనంగా చెబుతుంటారు. రాత్రి సమయంలో అమ్మవారు పురవీధుల్లో గుర్రంపై ఊరేగి దుష్టశక్తుల బారి నుంచి ప్రజలను కాపాడుతారని స్థల చరిత్ర. దానికి అనుగుణంగా మందిరం పరిచాలన కమిటీ ఇత్తడి గుర్రాన్ని రూపొందించి మందిరం ఎదుట ప్రతిష్టించారు. ఉత్సవాల సమయంలో గుర్రాన్ని పూర్తిగా ముస్తాబు చేసి పూజిస్తారు.

పాదాల గుడి

మజ్జిగౌరి అమ్మవారి భక్తులకు కేవలం ముఖం మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. ఎర్రటి సింధూర రంగులో అమ్మవారి ముఖం మనకు కనిపిస్తుంది. మరి కొంతదూరంలో అమ్మవారి పాదాలు ఉంటాయని పూర్వీకులు చెబుతుంటారు. అదేవిధంగా మిగతా భాగం మందిరానికి కొద్ది దూరంలోని మెయిన్‌ రోడ్డు వద్ద ఒక చెట్టు కింద ఉంటుందని భావిస్తుంటారు. ఇదే జెన్న బౌలి మందిరంగా మనకు దర్శనం ఇస్తుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక రాయిని తీసుకువచ్చి ఇక్కడ వేస్తారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది.

రూ.5 లక్షలతో ఉత్సవాలు

ప్రతీ ఏడాది మాదిరిగా ఈసారి కూడా అమ్మవారి చైత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.15 లక్షలు కేటాయించాం. ఐదు రోజులు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఇదిలా ఉండగా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే విధంగా సుమారు రూ.26 కోట్లతో అభివృద్ధి పనులకు నాంది పలికాం. ప్రస్తుతం మందిరం ప్రాంగణంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. – రాయిసింగి బిడిక, మేనేజింగ్‌

ట్రస్టీ, మజ్జిగౌరి దేవాలయం

ఇదీ చరిత్ర

15వ శతాబ్ధంలో జయపురం సంస్థానానికి చెందిన రాజా విశ్వనాథ్‌ దేవ్‌ తన పరిపాలనను విస్తరిస్తారు. ఈ క్రమంలో రాయగడను పాలించిన విశ్వనాథ్‌ దేవ్‌ అమ్మవారిని ఇష్టదైవంగా కొలుస్తారు. తాను నిర్మించిన కోట మధ్యలో అమ్మవారిని ప్రతిష్టించి పూజించడంతో అమ్మవారిని మఝిఘొరియాణిగా పిలుస్తారు. విశ్వనాథ్‌ దేవ్‌కు 108 మంది రాణులు ఉంటారు. కాలక్రమేణ యుద్ధంలో ఆయన మరణిస్తారు. దీంతో ఆయన సతీమణులు కూడా కోటలోనే సతీసహగమనం చేస్తారు. దీనినే సతీ కుండంగా పిలుస్తారు. ఇప్పటికీ మందిరానికి కుడివైపున సతీకుండం ఉంది. ప్రతీ మాస సంక్రాంతి నాడు ఈ సతీకుండం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు. రాజా విశ్వనాథ్‌ దేవ్‌ మృతి చెందడంతో కోట పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుంది. కోటలొ ఉన్న అమ్మవారి మందిరం ఆలనాపాలన కరువవ్వడంతో కూలిపోతుంది. ఇదిలా ఉండగా 1936వ సంవత్సరంలో బ్రిటీష్‌ పాలన కొనసాగుతున్న సమయంలో విజయనగరం నుంచి రాయిపూర్‌ వరకు రైలు మార్గం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జంఝావతి నదిపై వంతెన నిర్మించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. ఎన్నిసార్లు కట్టినా అర్ధాంతరంగా కూలిపోతుంటుంది. ఒకరోజు వంతెన నిర్మించేందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ నిద్రిస్తున్న సమయంలో అమ్మవారు అతడి కలలో కనిపించి ఈ ప్రాంతంలో నేను ఉన్నాను. నాకు మందిరం నిర్మించి పూజలు కొనసాగిస్తే వంతెన నిర్మాణం పూర్తవుతుందని చెబుతుంది. ఉలిక్కిపడి లేచిన కాంట్రాక్టర్‌ సమీపంలో వెదకడంతో శిథిలావస్థలో ఉన్న మందిరం కనిపిస్తుంది. అనంతరం కాంట్రాక్టర్‌ మందిరం నిర్మించి అమ్మవారిని ప్రతిష్టించి పూజలను నిర్వహిస్తారు. దీంతో వంతెన నిర్మాణ పనులు పూర్తవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement