బీజేడీ రాష్ట్రశాఖ నూతన కార్యవర్గం
రాయగడ: బీజేడీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ బల్లోపేతానికి సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యంల్లో ఆదివారం పార్టీ రాష్ట్రశాఖ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. యువజనతాదళ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షునిగా రాయగడకు చెందిన దేవాశీష్ ఖడంగ, బిజు ఛత్రజనతాదళ్ రాష్ట్ర శాఖ సాధారణ కార్యదర్శిగా బినాయక్ పొల్లయ్‌లు నియమించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. కొన్నాళ్లుగా పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న దేవాశీష్, బినాయక్‌లు రాష్ట్ర శాఖ కార్యవర్గంలో స్థానాన్ని సంపాదించుకోవడంతో వారి అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేయడంతో పాటు వారిని అభినందించారు.
ఆహార దుకాణాల్లో
అధికారుల తనిఖీలు
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఆహార దుకాణాల్లో మున్సిపాలిటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చేవారి ఆరోగ్య భద్రత దృష్ట్యా దుకాణాల్లో విక్రయించే ఆహారం, హోటళ్లలో అల్పాహారం, పాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో నాణ్యత లోపించకుండా ఈ తనిఖీలను అధికారులు నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ కార్యనిర్వాహక అఽధికారి కులదీప్‌కుమార్ తెలియజేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారుల సమక్షంలో హోటళ్లు, ఆహార స్టాళ్లలో వినియోగిస్తున్న నూనె, మంచినీరు, పరిశుభ్రతను పాటిస్తున్న తీరును పరిశీలించారు.
సెంచూరియన్ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం శని, ఆదివారాల్లో ఘనంగా జరిపారు. వర్సిటీలో పట్టభద్రులై అనేక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఇతర రంగాల్లో స్థిరపడిన విద్యార్థులు కలుసుకుని అధ్యాపకుల దీవెనలు పొందారు. వారికి సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాధ్ పాఢి ఆడిటోరియంలో దుశ్వాలువ, మెమొంటోలతో సత్కరించారు. అనేక రాష్ట్రాల నుంచి పూర్వ విద్యార్థులు పర్లాకిమిడి సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌కు విచ్చేసి రెండు రోజుల పాటు తోటి విద్యార్థులతో గడపడమే కాకుండా వారి అనుభవాలను అందిపుచ్చుకున్నారు.
సాయిలక్ష్మీ కాలనీలో చోరీ
● కత్తితో వృద్ధురాలిని బెదిరించి
బంగారం, నగదు దోపిడీ
రాయగడ: స్థానిక సాయిలక్ష్మీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సాయిలక్ష్మీ కాలనీలో నివసిస్తున్న పి.వాసు ఇంట్లో వృద్ధురాలు మాత్రమే ఉంటుందని గుర్తించిన దుండగులు లోనికి చొరబడి కత్తితో బెదిరించి మూడు తులాల బంగారు ఆభరణాలు, 70 వేల రూపాయల నగదును దోచుకున్నారు. వాసు తన సొంత లారీని మరమ్మతులు చేయించేందుకు బయటకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఆమె తల్లి ఒక్కరే ఉండగా శుక్రవారం అర్ధరాత్రి ఇంటి బయట తలుపులను విరగ్గొట్టి లోపలకు దుండగులు ప్రవేశించారు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


