లెక్కింపునకు సన్నాహాలు
రత్న భాండాగారం సొత్తు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయం రత్న భాండాగారం సొత్తు జాబితా తయారీ సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. అమూల్య రత్న సంపద నిర్వహణ నేపథ్యంలో క్రమబద్ధీకరించిన నియమావళితో రత్న భాండగారం లోపల, వెలుపల రెండు వేర్వేరు అంచెల్లో భద్రపరచిన అమూల్య రత్న సంపద లెక్కలు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రత్న భాండాగారం సంపదకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించే ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరబింద కుమార్ పాఢి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్షిక రథయాత్రకు ముందు ఆలయ ఆభరణాల లెక్కింపు, జాబితాను ప్రారంభించాలని నిర్ణయించారు. కమిటీ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులను ఉద్దేశించి సీఏఓ మాట్లాడుతూ జాబితా ప్రక్రియ కోసం క్రమబద్ధమైన పారదర్శకమైన మరియు దశలవారీ ప్రక్రియను నిర్ధారించడానికి 11 పేజీల ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) తయారు చేశామన్నారు. ఆభరణాల లెక్కింపు, డాక్యుమెంటేషన్ 3 విభిన్న దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ప్రస్తుతం తాత్కాలిక లేదా బాహ్య ఖజానాలో ఉంచిన ఆభరణాలను జాబితా చేస్తారు. దీని తర్వాత బాహ్య రత్న భాండాగారం యొక్క జాబితా, చివరగా ఆలయం యొక్క అత్యంత విలువైన, పురాతన ఆభరణాలను కలిగి ఉన్న లోపలి రత్న భాండాగారం జాబితా ఉంటుంది. ఆభరణాల వినియోగం క్రమబద్ధీకరణ, డాక్యుమెంట్ చేయడం,నిర్వహణ కోసం ఎస్‌ఓపీ వివరణాత్మక విధానాలతో రత్న భాండాగారం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) రూపకల్పన పూర్తయ్యింది. త్వరలో పాలక మండలి ఆమోదం కోసం దీనిని ప్రవేశ పెడతారని శ్రీ మందిరం సీఏఓ తెలిపారు. లెక్కింపు, జాబితాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.


