రెండు కార్లు ఢీ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ–లమతాపుట్ ల మధ్య మర్రిపెట్ట గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున ఒక కారును కోళ్లు రవాణా చేస్తున్న వ్యాన్ ఢీకొనటంతో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. పొగ మంచు దట్టంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తింది. ఆంధ్రప్రదేశ్‌లో బొర్రా గుహలు సందర్శించేందుకు కొందరు కారులో వెళ్తుండగా మర్రిపెట్ట గ్రామ సమీపంలో కారుకి ఎదురుగా వస్తున్న కోళ్లు రవాణా చేస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కొరకు కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
3 పులి పిల్లలు జననం
భువనేశ్వర్: నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లో శనివారం మూడేళ్ల జయశ్రీ అనే పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు వాటి లో 2 పిల్లలు మృతి చెందాయి. మిగిలిన ఒక పి ల్ల జంతు వైద్య నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్స పొందుతుందని కానీ ఒకటి మాత్రమే బతికిందని జూలాజికల్ పార్క్ అధికారులు ఆదివారం తెలిపారు. 101 రోజుల గర్భధారణ కాలం తర్వాత జయశ్రీ తొలి కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 17 మధ్య అమిత్ అనే పులితో జతకట్టింది. మొదటి కాన్పు కావడంతో పులికి తల్లి స్వభా వం లేక పిల్లలను చూసుకునే సామర్థ్యం కొరవడి ఈ పరిస్థితి చోటు చేసుకుందని విచారం వ్యక్తం చేశారు. మొదటి పిల్ల ఉదయం 11.55 గంటలకు జన్మించింది. జయశ్రీ దానికి శ్రద్ధ వహించకపోవడంతో జూ సిబ్బంది వెంటనే నవజాత శిశువును ఎన్‌సీయూకి తరలించి పశువైద్యుల నిరంతర పరిశీలనలో పర్యవేక్షిస్తున్నారు. మధ్యా హ్నం 3.34 గంటలకు జన్మించిన రెండో పులి పిల్ల పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉంది. దాన్ని నిర్వహించేటప్పుడు ఆ పులి ప్రమాదవశాత్తు దానిపైకి దొర్లడంతో గాయాలై మృతి చెందింది. సాయంత్రం 4.55 గంటలకు జన్మించిన మూడో పులి పిల్ల పుట్టిన వెంటనే తల్లి జయశ్రీ తినేసింది. ప్రస్తుతం బతికి ఉన్న ఒక్క పిల్ల జూ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో 24 గంటలూ పశువైద్య సంరక్షణలో చికిత్స పొందుతుంది. ఈ జననంతో నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లో మొత్తం పులు ల జనాభా ఇప్పుడు 29కి చేరుకుంది. వీటిలో 18 మగ పులులు, 11 ఆడ పులులు ఉన్నాయి.


