విజిలెన్స్ వలలో జూనియర్ ఇంజినీర్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి కార్యాలయ జూనియర్ ఇంజినీర్ నిహార్ రంజన్ సర్కార్ విజిలెన్స్ వలలో చిక్కారు. ఇతను అక్రమ అస్తులు కలిగి ఉన్నారని జయపూర్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో జయపూర్ విజిలెన్స్ న్యాయమూర్తి ఆదేశాలతో వారెంట్ల ఆధారంగా శుక్రవారం ఉదయం నలుగురు డీఎస్పీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, ఇతర సహయక సిబ్బంది నేతృత్వంలో మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్న నిహార్ రంజన్ ఆస్తులపై సోదాలు కొనసాగించారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో జయనగర్ ప్రాంతంలో ఉన్న అతని మూడు అంతస్తుల నివాస భవనం, మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.పి.వి.10 గ్రామంలో ఉన్న పూర్వీకుల ఇల్లు, మల్కన్‌గిరి సమితి కార్యాలయంలో ఆయన గదిలో కూడా సోదాలు చేశారు. పలు చోట్ల ఉన్న ఇళ్ల స్థలాల పట్టాలు, రూ. నాలుగు లక్షల నగదు, నాలుగు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. జూనియర్ ఇంజినీర్ నిహార్ రంజాన్ సర్కార్ జయపూర్ విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం కేసునమోదు చేస్తామని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.
విజిలెన్స్ వలలో జూనియర్ ఇంజినీర్


