శ్రామిక్ కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర
భువనేశ్వర్: ఖుర్దారోడ్ మండలం రైల్వే సిబ్బంది దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు కార్యకర్తలు పాద యాత్ర నిర్వహించారు. ఓపెన్ లైన్ శాఖ కార్యదర్శి లక్ష్మీ ధర మహంతి ఆధ్వర్యంలో పూరీ సెక్షన్ మొటోరి రైల్వే స్టేషన్ నుంచి మాలతీతిపట్‌పూర్ స్టేషన్ వరకు నిరవధికంగా పాద యాత్ర నిర్వహించారు. ఈ శాంతియుత ఆందోళనలో పలువురు కార్యకర్తలు పాలుపంచుకున్నారు. దిగువ స్థాయిలో సిబ్బంది దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార వర్గం పెడ చెవి వైఖరి ప్రదర్శించడంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు కార్యకర్తలు తెలిపారు. స్టేషను సిబ్బందికి మరుగు దొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కొరవడ్డాయి. మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునేందుకు అనువైన సౌకర్యం కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. సిబ్బంది క్వార్టర్లకు సురక్షిత తాగునీరు సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలు అందక పూరీ సెక్షన్‌లో సిబ్బంది సతమతం అవుతున్నారు. ఈ విషయమై అధికార వర్గం, కార్మిక వర్గం మధ్య 2024 సంవత్సరంలో జరిగిన కీలక పీఎన్‌ఎం తీర్మానాల అమలు పట్ల అనుబంధ అధికార వర్గాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ఎంతమాత్రం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


