ఘనంగా సుపరిపాలన దినోత్సవం
భువనేశ్వర్: మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఒడిశా సాహిత్య అకాడమీ, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం సంయుక్తంగా గురువారం శతదళ శీర్షికతో రాష్ట్ర స్థాయి కవితా పఠన కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక సంస్కృతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 100 మందికి పైగా కవులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి రాజనీతిజ్ఞత, ఆదర్శాలు, సాహిత్య వారసత్వాన్ని స్మరించుకుంటూ కవితా నివాళులర్పించారు.
రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి అంకితభావానికి సజీవ స్వరూపమన్నారు. సాహిత్య స్పృహ తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఆనందాన్ని పంచుతోందన్నారు. ఒడిశాలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు అటల్ బిహారీ వాజ్‌పేయికి అంకితమిస్తూ కవితలు పఠించారు. ఒడిశా సాహిత్య అకాడమీ కవులను సత్కరించింది. ప్రముఖ సాహితీవేత్త హరప్రసాద్ దాస్, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం కార్యదర్శి డాక్టర్ బిజయ్ కేతన్ ఉపాధ్యాయ, ఒడిశా సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ హోతా తదితర ప్రముఖులు కవితా పఠన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాయగడలో..
రాయగడ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం సుపరిపాలన దినోత్సవాన్ని స్థానిక మహిళా కళాశాలలో గురువారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, ఏడీఎం నిహారి రంజన్ కుహోరో, విద్యావేత్త డాక్టర్ డీకే మహంతి, న్యాయవాది భ్రజసుందర్ నాయక్, జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్‌లు పాల్గొన్నారు. దేశంలో స్వల్పకాలం పాటు ప్రధాన మంత్రిగా ఉన్నప్పటికీ వాజ్‌పేయి అవిశ్రాంత కృషి చేసారని వక్తలు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రహదారి, విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఏడీఎం నిహారి రంజన్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ భారతీ చౌదరి, ప్రొఫెసర్ శాంతిలత మిశ్రా పాల్గొన్నారు.
ఘనంగా సుపరిపాలన దినోత్సవం
ఘనంగా సుపరిపాలన దినోత్సవం
ఘనంగా సుపరిపాలన దినోత్సవం
ఘనంగా సుపరిపాలన దినోత్సవం


