ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక
టెక్కలి: మండల విద్యా శాఖా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ (మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్) కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం టెక్కలిలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా పి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కె.ఉపేంద్ర, ఆర్థిక కార్యదర్శిగా బి.రామ్‌ప్రసాద్, ఉపాధ్యక్షులుగా బి.శశిరేఖదేవి, సహాయ కార్యదర్శిగా ఆర్.సంతోష్‌కుమార్, గౌరవ సలహాదారుడిగా ఎస్.గౌరీశంకర్, డి.సిహెచ్.రాంబాబు, సభ్యులుగా జి.చంద్రశేఖర్, వై.లింగరాజు, ఎస్.కళ్యాణి, పి.విజయ్ తదితరులను ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేయాలని నినాదాలు చేశారు.
బావిలో వృద్ధురాలి
మృతదేహం
మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టిలోని ఓ బావిలో వృద్ధురాలి మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. మృతురాలు అదే గ్రామానికి కొల్లి మాణిక్యం (67)గా గుర్తించారు. మాణిక్యం భర్త కొన్నేళ్ల క్రితమే విడిచిపెట్టి వెళ్లిపోవడంతో కుమార్తెను పెంచి పెళ్లి చేసింది. అనంతరం మతిస్థిమితం సరిగ్గా లేక పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో మెళియాపుట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న బావిలో మాణిక్యం మృతదేహాన్ని అక్క కొడుకు నక్కల కిరణ్ గురువారం గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బావికి స్నానానికి వెళ్లి పొరపాటున పడిపోయి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు.
పొందూరులో..
పొందూరు: స్థానిక నాగవంశం వీధికి చెందిన నల్లి సురేష్(40) పొందూరులోని బండార్లమ్మ చెట్టు సమీపంలోని బావిలో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ ఈ నెల 22న తెల్లవారుజామున నిద్ర లేచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఏం జరిగిందో గాని గురువారం స్థానిక బావిలో సురేష్ మృతదేహం తేలింది. కొద్ది రోజులుగా మతి స్థిమితం లేకుండా ఉన్నాడని, పచ్చకామెర్లతో బాధపడుతున్నాడని, మద్యం ఎక్కువగా తాగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.చెప్పారు.
ప్రొసీడింగ్ పత్రాలు అందజేత
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్, న్యాయవాది చౌదరి లక్ష్మణరావు కుటుంబానికి ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ద్వారా మంజూరైన వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ ప్రొసీడింగ్ పత్రాలను అతని భార్య స్వాతికి గురువారం అందజేశారు. న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.9 లక్షలు విడుదలైనట్లు వారు తెలిపారు. వెల్ఫేర్ ఫండ్‌ను రూ.4లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచిన తర్వాత ఇదే మొదటి క్లెయిమని, నామిని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుందని, ప్రభుత్వం నుంచి కూడా కొంత నగదు రానుందని చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు గేదెల వాసుదేవరావు, జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తంగి శివప్రసాద్, పెట్ట దామోదర్‌రావు, మాజీ అధ్యక్షుడు ఎన్.సూర్యారావు, బాలకృష్ణ చాంద్, మామిడి క్రాంతి, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగురు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి బి.ఎస్.చలం, చిన్నాల జయకుమార్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణించే వారి సౌలభ్యం కోసం ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసి దిక్సూచీ బోర్డులు దయనీయంగా మారాయి. కవిటి నుంచి ఈదుపురం వెళ్లే రోడ్డులో కేశుపురం జంక్షన్ మూడు రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన బోర్డు మూడు రోజుల క్రితం కిందకు జారిపడటంతో దిక్కులు తారుమారయ్యాయి. కొత్తగా వచ్చే ప్రయాణికులు తికమకపడుతున్నారు. అధికారులు స్పందించి బోర్డును సరిచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – ఇచ్ఛాపురం రూరల్
ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక


