ఐటీఐలకు మహర్దశ
భువనేశ్వర్: రాష్ట్రంలో సాంకేతిక విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిష్టాత్మకమైన ఉత్కర్ష్ ఐటీఐ యోజనను ఆమోదించింది. దీని కింద ఎంపిక చేసిన పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐ) జోనల్ ఉత్కర్ష్ ఐటీఐలుగా అభివృద్ధి చేస్తారు. ఈ పథకం కింద 5 ప్రభుత్వ ఐటీఐలు.. పూరీ, బొలంగీర్, అంబగూడ, రాజకనిక (కేంద్రాపడా), రౌర్కెలా (సుందర్‌గడ్) ఆధునిక సౌకర్యాలు, అధునాతన శిక్షణ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. ఉత్కర్ష్ ఐటీఐల ప్రాముఖ్యత ఈ ఐటీఐల్లో ఆధునిక ప్రయోగశాలలు, స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ అభ్యాసన ప్రాంగణాలు పునరుద్ధరించబడిన మౌలిక సదుపాయాలతో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. అధునాతన శిక్షణ, అధ్యాపక అభివృద్ధి, మూల్యాంకనాలు, ఆవిష్కరణలకు జోనల్ హబ్‌లుగా పనిచేస్తాయి. స్వయం ఉపాధి, ఉద్యోగ నియామకాలకు మద్దతు ఇచ్చే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్, ప్లేస్‌మెంట్ సెల్‌లను మెరుగుపరుస్తాయి. ప్రాంతీయ నైపుణ్య అవసరాలకు అనుగుణంగా శిక్షణార్థులకు సులభమైన ప్రవేశంతో కీలకమైన పారిశ్రామిక, విద్యా కేంద్రాల వ్యూహాత్మక అనుసంధానం చురుగ్గా పని చేస్తుంది.
పేదలకు దుప్పట్ల పంపిణీ
రాయగడ: తన కుమారుడి పుట్టినరోజు పురస్కరించుకొని జిల్లాలోని కల్యాణ సింగుపూర్ లంబత వీధిలో నివసిస్తున్న చిన్మయ లంబట దంపతులు పేదలకు దుప్పట్లను గురువారం పంపిణీ చేశారు. గ్రామంలోని 100 మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది శీతాకాలం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
పేకాట శిబిరంపై దాడి
గార: శ్రీకూర్మం పంచాయతీ చింతువలస సమీప పొలాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సీహెచ్.గంగరాజు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన వీరి నుంచి రూ.7,320 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, బైక్‌లను సీజ్ చేసినట్లు చెప్పారు. బహిరంగంగా మద్యం తాగడం, పేకాట ఆడటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వ్యక్తులపై కఠిన చర్య లు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.


