
శ్రీ జగన్నాథుని సర్వ దర్శనానికి అంతరాయం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో మంగళవారం రత్న వేదికపై చతుర్థా మూర్తుల సర్వ దర్శనానికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. మందిరం లోపలి ప్రాంగణంలో ఉమ్మి వేసినట్లు దృష్టికి రావడంతో ఆకస్మికంగా మూల విరాట్లకు శుద్ధి స్నానం చేయించాల్సి వచ్చింది. ఇదో గోప్యమైన ఆచారం కావడంతో ఈ ప్రక్రియ ముగిసేంత వరకు భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. దాదాపు గంటన్నర పాటు సర్వ దర్శనం స్తంభించి పోయింది. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లినప్పుడు నిర్వహించే ముఖ్యమైన శుద్ధీకరణ కర్మ మహా స్నానంగా పేర్కొంటారు. ఈ ఆచారం సమయంలో, ఆధ్యాత్మిక స్వచ్ఛతను పునరుద్ధరించడానికి రత్న వేదికపై కొలువు దీరిన జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలను ఆచారబద్ధంగా శుద్ధి చేస్తారు.
మొబైల్ దుకాణంలో చోరీ
రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో నేతాజీ క్లబ్ సమీపంలోఉన్న ఒక మొబైల్ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు దుకాణం తాళాలు విరగ్గొట్టి లొపలకు చొరబడి విలువైన వివిధ బ్రాండ్‌ల మొబైళ్లను దొంగింలించారు. అయితే తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు దుండగులు దుకాణంలోని సీసీ కెమెరాలను విరగ్గొట్టడంతో పాటు హార్డ్ డిస్క్‌ను తమ వెంట తీసుకువెళ్లిపొయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుకాణం యజమాని అరుణ్ పాత్రో మంగళవారం ఉదయం మొబైల్ దుకాణాన్ని తెరిచేందుకు వెళ్లగా తలుపులు విరిగి పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. లోనికి వెళ్లి చూడగా నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే 22 మొబైళ్లు చోరీకి గురైనట్టు పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు.
తిరుపతిలో వలస కార్మికుడు మృతి
రాయగడ: తిరుపతిలో వలస కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి పరిధి బంకాంబ పంచాయతీలొని మంకొడొజొల గ్రామానికి చెందిన ఉమాశంకర్ మాఝి (21)గా గుర్తించారు. కొద్ది నెలల క్రితం నుంచి స్నేహితులతో కలసి ఉమాశంకర్ తిరుపతిలోని ఒక పైపుల కంపెనీలో పనిచేస్తుండేవాడు. ఈ నెల ఆరో తేదీన అస్వస్థతకు గురైన అతడు ఆదివారం మృతి చెందినట్లు కంపెనీ వర్గాలు అతని కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు సొమవారం తిరుపతి వెళ్లారు. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అంతిమ సంస్కారాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య
మల్కన్‌గిరి: మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి చితాపారి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకోగా.. సవిత (30) ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన పూర్ణచంద్ర ముదిలీ కుమారై సవిత రోజూ ఉదయాన్నే లేచి తండ్రికి టీ చేసి ఇవ్వడం అలవాటు. మంగళవారం ఉదయం ఇవ్వకపోవడంతో తండ్ర వెళ్లి గదిలోకి చూడగా సవతి ఫ్యాన్‌కు వేలాడుతూ చనిపోయి కనిపించింది. దీంతో బలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ దీరాజ్ పట్నాయక్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. సవితకు కొన్ని సంవత్సరాల క్రితం వీరకిశోరపూర్ గ్రామానికి చెందిన పవిత్రో ఖీలోతో వివాహం జరిగింది. అయితే కొద్ది నెలల తరువాత భర్తతో తగాదా రావడంతో అతన్ని విడిచిపెట్టేసి తండ్రి పూర్ణచంద్ర ముదిలి వద్దకు వచ్చేసి ఉంటుంది. ఆ తరువాత చితాపారికు చెందిన ఖగపతి కిర్సనీ వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ పరిస్థితిలో సవిత ఆత్మహత్యకు పాల్పడం అనుమానాలకు తావిస్తుంది. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

శ్రీ జగన్నాథుని సర్వ దర్శనానికి అంతరాయం

శ్రీ జగన్నాథుని సర్వ దర్శనానికి అంతరాయం