
అభ్యర్థులకు ఇంటర్వ్యూ మార్కులు తెలియజేయాలి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర సమచార హక్కు కమిషన్ చారిత్రాత్మక ఆదేశం జారీ చేసింది. ఎంపిక పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మార్కుల వివరాలు తెలియజేయాల్సిందేనని ఆదేశించింది. ప్రభావిత అభ్యర్థి అభ్యర్థన మేరకు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.
2022లో సహాయ ఉపాధ్యాయుని పదవికి ఎంపిక కాని అభ్యర్థికి ఇంటర్వ్యూ మార్కులు వివరాలు కావాలని ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓపీఎస్‌సీ)ను అభ్యర్థించారు. అది సాధ్యం కాదని ఓపీఎస్‌సీ అభ్యర్థిని నిరుత్సాహానికి గురిచేసింది. భద్రక్ జిల్లాకు చెందిన మీనతి రాణి మహాపాత్రో చరిత్ర విభాగం సహాయ ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసి అనుబంధ పరీక్షలకు హాజరైంది. ఆ ఉద్యోగ భర్తీకి అర్హత సాధించేందుకు కెరీర్ మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారని నోటిఫికేషన్ పేర్కొంది. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 జూన్‌లో విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మీనతిరాణి మహాపాత్రో పేరు కనిపించలేదు. ఫలితాలతో అసంతృప్తి చెంది తన కెరీర్ రేటింగ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కోరుతూ 2022 డిసెంబర్‌లో సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థన పత్రం దాఖలు చేసింది. ఆ అభ్యర్థన పట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాక్షికంగా స్పందించింది. అభ్యర్థి కోరిన ప్రకారం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెరీర్ మార్కులు మంజూరు చేసి ఇంటర్వ్యూ మార్కులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సమాచార కమిషన్ ముందు విచారణ సందర్భంగా.. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి ఆ ఉద్యోగ ఎంపికకు ఎటువంటి ఇంటర్వ్యూ మార్కులు నమోదు చేయలేదు, కనీస మార్కుల ప్రామాణికత నిర్ణయించలేదని వివరించారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వం, మాట్లాడే శైలి, నైపుణ్యాలు, మొదలైన వాటిని పరిశీలించే ప్రక్రియ మాత్రమే. ఇంటర్వ్యూలో పరిశీలన ఆధారంగా మాత్రమే అర్హత నిర్ణయించబడుతుందని సమాచార కమిషన్‌కు తెలియజేశారు. అభ్యర్థులు తగినవారో, కాదో మాత్రమే వారికి తెలియజేస్తారు. అభ్యర్థులకు నిర్ధిష్ట మార్కులు ఇవ్వబడవు, ఎటువంటి మెరిట్ జాబితా ప్రచురించబడదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మనోజ్ పరిడా తన చారిత్రాత్మక తీర్పులో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న నిర్ణయం సమాచార హక్కు చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో పొందిన మార్కులను తెలుసుకునే హక్కు అభ్యర్థికి ఉంది. ఇది తదుపరి ప్రయత్నంలో తన పని తీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి అభ్యర్థికి, ముఖ్యంగా పరీక్షలో విఫలమైన అభ్యర్థికి, తాను ఏ ప్రాతిపదికన విజయం సాధించలేకపోయానో తెలుసుకునే హక్కు ఉంది. ఈ విషయంలో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులను అంధకారంలో ఉంచకూడదు. సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 22 కింద దరఖాస్తుదారులకు సమాచారం అందించడంలో అన్ని ఇతర చట్టాలు, నిబంధనలను అధిగమిస్తుందని తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన విధానాన్ని మార్చుకోవాలని, అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను అందించాలని స్పష్టంగా ఆదేశించింది.