
టీటీఈలకు బయోమెట్రిక్ హాజరు
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం రైలు టికెట్ తనిఖీ సిబ్బంది (టీటీఈ)కి బయోమెట్రిక్ హాజరు నమోదు వ్యవస్థని ప్రవేశ పెట్టారు. రైల్వే కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనం దిశలో ఈ చర్య చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చొరవతో సిబ్బంది విధుల నిర్వహణ ఆరంభం, ముగింపు రెండు దశల్లో (సైన్–ఇన్ మరియు సైన్–ఆఫ్) బయోమెట్రిక్ వ్యవస్థని అనుసరించాల్సి ఉంటుంది. ఈ విధానం తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఖుర్దారోడ్ మండలం అధికారులు తెలిపారు. సిబ్బంది విధుల హాజరు వ్యవస్థ క్రమబద్ధీకరణ పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఖుర్దా రోడ్, పూరీ, భువనేశ్వర్, భద్రక్, జాజ్‌పూర్ కెంజొహర్ రోడ్, కటక్, బలుగాంవ్, బరంపురం, పలాస, ఢెంకనాల్, అంగుల్, పారాదీప్ 12 స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ టీటీఈ లాబీలలో బయోమెట్రిక్ ఆధారిత లాగ్ ఇన్, లాగ్ ఆఫ్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. ఖుర్దారోడ్ రైల్వే మండలం పరిధిలో దాదాపు 550 మంది టికెటు తనిఖీ సిబ్బంది హాజరుని ఈ వ్యవస్థ అధునాతన సాంకేతిక విధానంలో పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది.
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థని 950 పైబడి ప్రదేశాల్లో విజయవంతంగా అమలు చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అధీనంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ – డీఏసీ) సమన్వయంతో బయోమెట్రిక్ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ఈ వ్యవస్థ ఆధార్ ఆధారిత వేలిముద్ర ప్రామాణీకరణ పరికరాలను ఉపయోగిస్తుంది, యూడీఏఐ, ఎస్‌టీక్యూసీ ధృవీకరణతో ఈ–ప్రమాణ్ పోర్టల్ అనుసంధానంతో పని చేస్తుంది. న్యూ ఢిల్లీ టీటీఈ లాబీలో ప్రయోగాత్మకంగా అమలు చేసి కార్యాచరణ ధృవీకరించి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అంచెలంచెలుగా ప్రవేశ పెడుతున్నారు. బయో మెట్రిక్ హాజరు నమోదు రైలు ప్రయాణికుల సౌకర్యాల రంగంలో అనుబంధ సిబ్బంది సామర్థ్యం మరియు పారదర్శకతను బలోపేతం చేసి ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందజేసేందుకు దోహదపడుతుంది.