
సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలో అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందించాలంటే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో సదస్సు నిర్వహించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్స్‌జెండర్లు, గిరిజనులు, అసంఘటిత కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రయోజనాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాల అధికారులు తాము అందిస్తున్న పథకాలను వివరించగా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమాజానికి తాము చేస్తున్న సేవలను తెలియజేశారు. కార్యక్రమంలో డీసీపీవో రమణ, ఎల్‌ఏడీసీ ప్రధాన అధికారి కె.ఆఫీసు పాల్గొన్నారు.
వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్ల : ఏపీ ఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించిన బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు బీ–పార్మసీ, ఫార్మాడీ, బీ టెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిందని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయకర్త కె.నారాణరావు మంగళవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రోసెసింగ్ కోసం ఈ నెల 11 నుంచి 16 వరకూ రుసుము చెల్లించాలని చెప్పారు. ఈ నెల 12 నుంచి 17లోగా ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ పరిశీలన, 13 నుంచి 18 వరకూ కళాశాలల కోర్సుల ఎంపికకు వెబ్ ఆప్షన్లు, 19న వెబ్ ఆప్షన్ల మార్పు, 21న కళాశాలలు, కోర్సుల కేటాయింపు జాబితా వెల్లడించనున్నట్లు వివరించారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోగా కళాశాలల్లో రిపోర్టు చేసుకోవాలన్నారు.
నిరసన ర్యాలీ విజయవంతం చేయండి
శ్రీకాకుళం న్యూకాలనీ: విజయవాడ ధర్నాచౌక్ వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరగనున్న శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుడు జామి శ్రీకాంత్‌బాబు మంగళవారం పిలుపునిచ్చారు. లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కొన్ని సంవత్సరాలుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక వయస్సు కూడా దాటిపోయి మానసిక సంఘర్షణ, ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
మెరుగైన ఫలితాలే లక్ష్యం
పాతపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని, ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఉంటుందని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్.సురేష్‌కుమార్ అన్నా రు. మంగళవారం పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని, విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి దుర్గారావు, ప్రిన్సిపాల్ టి.హేమసుందరరావు, అధ్యాపకులు ఉన్నారు.
గంజాయి కేసులో పదేళ్ల జైలుశిక్ష
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం వద్ద 2022లో గంజాయి అమ్ముతూ పట్టుబడిన గణశ్యామ్ బెహరా, రెయ్యి త్రినాథ్, పైల వాసులకు పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూయల జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి పి.భాస్కరరావు తీర్పు వెల్లడించారని సీఐ మీసాల చిన్నంనాయుడు మంగళవారం తెలిపారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని సీఐ పేర్కొన్నారు.
బంగారం చోరీపై కేసు నమోదు
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలో దుక్క మధుసూదన్ రెడ్డి ఇంట్లో బంగారం చోరీకి గురైంది. ఎస్సై పిన్నింటి రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. మధుసూదన్ రెడ్డి ఇంట్లో కొద్దిరోజుల కిందట నగదు, బంగారం మాయమైంది. అయితే ఇంట్లో పనిచేస్తున్న మహిళపై అనుమానంతో ప్రశ్నించగా ఏమీ తెలియదని సమాధానం ఇచ్చింది. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.