
విన్నపాలు వింటూ..
● ప్రజలతో మమేకమవుతూ గవర్నర్ పర్యటన
కొరాపుట్: గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రజలతో మమేకమవుతూ తన పర్యటన సాగిస్తున్నారు. నిబంధనలు పక్కన పెట్టి మంగళవారం రెండో రోజు కొరాపుట్‌లో ఆయన పర్యటన సాగింది. విపక్ష పార్టీల నేతలతో కూడా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత గవర్నర్ల కంటే విభిన్నంగా ఈ పర్యటన సాగడం విశేషం. ఉదయం ఆయన ఒడిశా కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. విశ్వ విద్యాలయంలో వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. చాన్స్‌లర్ హోదాలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల అమలు తీరుపై నివేదికలు పరిశీలించారు. ఇదే వేదిక వద్ద అఖిల పక్ష పార్టీల నాయకులు గవర్నర్ వద్దకు చేరుకున్నారు. వారందరినీ దగ్గరకు పిలిపించుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత లేఖని గవర్నర్‌కు అందజేశారు.
లక్ష్మీపూర్ సమితిలో కొడింగా మాలి వద్ద గనుల తవ్వకాలు, తాము చేస్తున్న పోరాటం వివరించారు. అక్కడ గిరిజనులకు ఫెరి ఫెరి డెవలప్‌మెంట్ నిధులు ద్వారా సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. మొదట పేర్కొన్న విధంగా కాకుడా గనుల రెట్టింపు తవ్వకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సమస్యను గవర్నర్ కూలంకషంగా తెలుసుకున్నారు. ఈ బృందంలో బీజేడీకి చెందిన జిల్లా అధ్యక్షుడు జిన్ను హిక్కా తదితరులు ఉన్నారు. అనంతరం రాజ్‌పుట్‌లో గిరిజన మహిళలు నిర్వహిస్తున్న మిలెట్ మిషన్‌ని సందర్శించారు. మిలెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రభుత్వ సహకారంతో మహిళలు అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ వివిరించారు. అక్కడ గిరిజన మహిళలను పిలిపించుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెక్కలు నాటి వన యజ్ఞం ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రాం చంద్ర ఖడం, బీజేపీ ఎమ్మెల్యేలు రూపుధర్ బోత్ర, రఘురాం మచ్చో, ఎస్పీ రోహిత్ వర్మలు పాల్గొన్నారు.

విన్నపాలు వింటూ..

విన్నపాలు వింటూ..