
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలి
రాయగడ: మన భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కళలు, సంప్రదాయాలపై యువత అవగాహన కలిగి ఉండాలని స్థానిక అటానమస్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రసన్నకుమార్ గంతాయిత్ అన్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా స్థానిక రామక్రిష్ణనగర్‌లో ఆదివారం రాత్రి చిన్నారుల మధ్య పాటలు, నృత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రం భిన్న సంస్తృతులు, కళలకు పుట్టినిళ్లన్నారు. వాటిపై యువతకు అవగాహన కలిగేలా ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తుండాలని అన్నారు. అయితే నేటి యువత ఆధునిక పోకడలకు బానిసై మన సంస్తృతులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పోటీల్లొ గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయుడు అమరేంద్ర జెన్న, నృత్య శిక్షకురాలు ఆర్. ఇందిరాలు పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
మంటల్లో చిక్కుకున్న విద్యుత్ వాహనం
భువనేశ్వర్: స్థానిక నయాపల్లి ప్రాంతంలోని ఫ్లై ఓవర్‌పై సోమవారం విద్యుత్ వాహనం (స్కూటీ) మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తు స్కూటీ రైడర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలిగాడు. ఫ్లై ఓవర్‌పై స్కూటీపై యువకుడు ప్రయాణిస్తుండగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ పరిస్థితి గమనించిన మరుక్షణమే స్కూటీని ఆపి కిందకు దిగడంతో ప్రాణ హాని తప్పింది. రోడ్డుపై ఉన్న జనం చూస్తుండగా కాసేపటికే స్కూటీ దగ్ధమైంది. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు.
పులి చర్మాలు స్వాధీనం
రాయగడ: జిల్లాలోని కొలనార ఎన్‌హెచ్ రోడ్డు సమీపంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ముంబై జోనల్ యూనిట్ అధికారులు ఆదివారం రాత్రి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో రెండు పులి చర్మాలతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ నాయక్, రాజ్ కుమార్ గుప్తా, రాయగడ జిల్లా గునుపూర్‌లోని మఛకుంటి ప్రాంతానికి చెందిన మహేష్ హుయిక, పుటాసింగి ప్రాంతానికి చెందిన జిసయ్య గొమాంగోలు ఉన్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న పులి చర్మాలతో పాటు నిందితులను రాయగడ అటవీ శాఖ రేంజ్ అధికారి కామేశ్వర్ ఆచారికి అధికారులు అప్పగించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు.
చైన్నెలో వలస కార్మికుడు మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాసమితి పరిడా గ్రామానికి చెందిన వలస కార్మికుడు బాలకృష్ణ ఘంట (32) చైన్నెలో శనివారం మూడంతస్తుల భవనం నుంచి జారిపడి మృతి చెందాడు. పరిడా గ్రామానికి చెందిన బాలకృష్ణ ఘంట పొట్టకూటి కోసం చైన్నె వెళ్లి భవన నిర్మాణంలో రాజమేసీ్త్ర వద్ద మేసీ్త్రగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేటు భవంతిలో పనిచేస్తుండగా మూడోఅంతస్తు వద్ద కాలుజారి పడిపోయి మృత్యువాత పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పరిడా గ్రామస్తులు చైన్నె వెళ్లి బాలక్రిష్ణ ఘంట పనిచేస్తున్న రాజమేసీ్త్రని సంప్రదించి శవాన్ని ఒడిశాలో గజపతి జిల్లాలో పరిడా స్వగ్రామానికి సోమవారం తీసుకువచ్చారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలి

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలి