
గవర్నర్‌ను కలిసిన వైమానిక కమాండింగ్–ఇన్–చీఫ్
భారత వైమానిక దళం తూర్పు వైమానిక కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్, ఎయిర్ మార్షల్ సూరత్ సింగ్ శనివారం రాజ్ భవన్‌లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని కలిశారు. రక్షణ సన్నద్ధతకు సంబంధించిన అంశాలు మరియు పరస్పర ఆసక్తి ఉన్న విషయాలపై వీరివురు చర్చించారు. – భువనేశ్వర్
రాష్ట్రంలో పురోగతి సాధించిన విద్యా సంస్థలు
భువనేశ్వర్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన నేషనల్ ఇనన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్స్‌లో ఒడిశాలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు గణనీయమైన పురోగతి సాధించాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో స్థానిక ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం ఓయూఏటీ ఎన్‌ఐఆర్‌ఎఫ్ – 2025లో 19వ స్థానంలో నిలిచింది. మేనేజ్‌మెంట్ విద్యను అందించే 100 ఉత్తమ సంస్థలలో ఐఐఎం సంబల్‌పూర్ 34వ స్థానం సాధించగా స్థానిక ఉత్కళ విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వర్గం కింద 48వ స్థానం సాధించింది. జాతీయ స్థాయిలో తొలి 100 ఉన్నత విశ్వవిద్యాలయాలలో స్థానిక శిక్ష్యా ఓ అనుసంధాన్ (ఎస్‌ఓఏ) డీమ్డ్ టు బి యూనివర్సిటీ 15వ, కిట్ 17వ స్థానాల్లో నిలిచాయి. రౌర్కెలా ఎన్‌ఐటీ – 34, భువనేశ్వర్ ఐఐటీ – 80, భువనేశ్వర్ ఎయిమ్స్ 100వ స్థానం సాధించాయి.
మహానది
ట్రిబ్యునల్ విచారణ
భువనేశ్వర్: జస్టిస్ బేలా ఎం. త్రివేది అధ్యక్షతన మహానది జల వివాదాల ట్రిబ్యునల్ శనివారం విచారణ ప్రారంభించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్ 2 రాష్ట్రాల మధ్య దీర్ఘ కాలంగా కొనసాగుతున్న మహానది జలాల పంపిణీ వివాదం కొత్త దశలోకి ప్రవేశించింది. విచారణ పురస్కరించుకుని రెండు రాష్ట్రాలు జలాల పంపిణీ వివాదం సమస్యను సహకార స్ఫూర్తితో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తమ సన్నద్ధతను ట్రిబ్యునల్ సమక్షంలో వ్యక్తీకరించడం విశేషం. ఒడిశా తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య ఈ ఏడాది ఆగస్టు నెలలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య పలు సమావేశాలు జరిగాయని ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. ఈ సమావేశాల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల జల వనరుల శాఖ కార్యదర్శులు, ప్రభుత్వాల ప్రముఖ కార్యదర్శుల మధ్య చర్చలు చోటు చేసుకున్నట్లు వివరించారు. సయోధ్య కోసం నిరంతర ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ అక్టోబర్ నెలలో మరో ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని పీతాంబర ఆచార్య పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ జల వనరుల శాఖ కార్యదర్శి కూడా ఈ విషయాన్ని ధృకరించారు. అంతర్ రాష్ట్ర సంభాషణల ద్వారా సాఽనుకూల పురోగతి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా మహా నది సమస్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించి అత్యున్నత స్థాయిలో సామరస్య పరిష్కారానికి ప్రతిపాదించినట్లు రాష్ట్ర అడ్వకేటు జనరల్ పీతాంబర ఆచార్య వెల్లడించారు.
రెండు రాష్ట్రాలు తమ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సన్నద్ధతను వ్యక్తం చేశాయి. దీర్ఘకాల పోరు నుంచి సహకార స్ఫూర్తితో సామరస్య పరిష్కారానికి మొగ్గు చూపడం శుభ సంకేతంగా పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, కేంద్ర జల సంఘం మార్గదర్శకత్వంలో ఉమ్మడి సాంకేతిక కమిటీని ఏర్పాటు ప్రతిపాదన విషయాల్ని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ట్రిబ్యునల్‌కు వివరించారు. సామరస్య పరిష్కారం యోచన ఫలప్రదమైతే మహానది నదీ వ్యవస్థపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ఈ దిశలో ఆశాజనకమైన మలుపును ఆవిష్కరిస్తుంది.