
ఒడియాలో నేమ్ బోర్డులు తప్పనిసరి
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యాపార సంస్థల నేమ్ బోర్డులను ఒడియాలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ యంత్రాంగం ఉత్తర్యులను జారీ చేసింది. అయితే నియమాలను పట్టించుకోని వ్యాపార సంస్థలపై అధికారులు కొరడా ఝలిపించారు. ఈ మేరకు శనివారం రాయగడ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది తనిఖీలను నిర్వహించారు. ఇంగ్లిష్‌లో సైన్ బోర్డులను ఏర్పాటు చేసిన వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా వ్యాపార సంస్థలు యజమానులు వారి వ్యాపారాలకు సంబంధించిన నేమ్ బోర్డులను ఒడియాలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే రోజూకు 500 రూపాయలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఒడియాలో నేమ్ బోర్డులను ఏర్పాటు చేసినంత వరకు ఈ ప్రక్రియ వర్తిస్తోందని నోటీసులో స్పష్టం చేశారు. ఉత్తర్యులకు అనుగుణంగా స్పందించిన వ్యాపారస్తులకు లైసెన్స్ రెన్యువల్ సమయంలో 50 శాతం రుసుంలో సబ్సిడీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
రైతులకు పవర్ టిల్లర్లు
అందజేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఎరియా బోఢపోడ పంచాయతీలో రైతులకు పవర్ టిల్లర్లను శుక్రవారం పంపిణీ చేశారు. బోడపోడ ల్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం తరఫున ఆరుగురు రైతులకు వీటిని సమకూర్చారు. రానున్న రోజుల్లో మరికొంతమంది రైతులకు వీటిని అందజేస్తామని కూడుములగుమ్మ ల్యాంప్ అధ్యక్షుడు గోపీ పంగి తెలిపారు. పెప్పరమేట్ల పంచాయతీకి చెందిన మదన్ ఖేముడు, తుంబనాధ్ ఖీలో, తైల తలాబ్, కామటి సిందేరీ, లక్ష్మణ ఖరా, హర ఖేముడుకు వీటిని అందించారు.

ఒడియాలో నేమ్ బోర్డులు తప్పనిసరి