
ఎరువుల కొరత
రాయగడ: వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ఆచరణలో చేసి చూపించడం లేదు. జిల్లాలో ఎరువుల కొరత తీవ్రరూపం దాల్చుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎరువుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక వైపు ఉభాలు పూర్తి చేసి ఎరువులు వేసే సమయానికి ఎరువులు సకాలంలో అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ డీలర్లు తమ వద్దకు వచ్చిన రైతులను నిలువునా దోచేస్తున్నారు. ఎరువల బస్తాతో మరి కొన్ని రసాయనాలను అంటగడుతున్నారు. ఇవి తీసుకుంటేనే ఎరువుల బస్తా ఇస్తామంటూ తెగేసి చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేక రైతులు ఎరువుల కోసం అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం 14050 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా ఇప్పటికి కేవలం 6 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా అయ్యాయి. దీంతో ఎరువుల కొరత తీవ్రమైంది. రైతులకు సకాలంలో అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డుకు కేవలం ఒకే ఎరువుల బస్తాను మంజూరు చేస్తున్నారు. ధర కూడా పెంచి అమ్ముతున్నారు.
నామమాత్రపు దాడులు
జిల్లాలో ఇటీవల బిసంకటక్ సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ప్రైవేట్ ఎరువుల గోదాముల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అధిక ధరలకు ఎరువులను రైతులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఈ మేరకు అధికారులు దాడులను నిర్వహించి కొందరు డీలర్లకు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు. తాజాగా శనివారం జిల్లాలోని కాశీపూర్‌లో అధికారులు ఎరువుల గోదాముల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అయితే జిల్లా కేంద్రంలో మాత్రం ఇంతవరకు ఎరువుల గోదాముల్లో అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎరువుల కొరత