
రాయగడలో ఆదర్శ గ్రామాల గుర్తింపు
రాయగడ: జిల్లాలోని 42 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా గుర్తించి వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టిందని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెమండొ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ పథకంలో భాగంగా ఈ గ్రామాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక డీఆర్‌డీఏ సమావేశ హాల్‌లో శనివారం నిర్వహించిన ఆది కర్మ యోగి శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో దాదాపు 56 శాతం మంది కొండకోనల్లొ, అత్యంత వెనుక బడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని వారికి విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలను కల్పించి ఆయా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఆదర్శ గ్రామాలుగా గుర్తించిన 42 గ్రామాల నుంచి 20 మంది సభ్యులను ఎంపికచేయాలని అన్నారు. ఇందులో సర్పంచులు, సమితి సభ్యులు, యువకులు, స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ఉండాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన సభ్యులను ఆది కర్మ యోగులుగా గుర్తించాలని వివరించారు. ఈ ఎంపిక ప్రక్రియ ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. అనంతరం కార్యచరణ ప్రణాళికను రూపొందించి దానికి అనుగుణంగా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కలెక్టర్‌కు నివేదించాలన్నారు.

రాయగడలో ఆదర్శ గ్రామాల గుర్తింపు