
దిదాయ్ బాలికకు గవర్నర్ సత్కారం
భువనేశ్వర్: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో అర్హత సాధించిన తొలి దుర్బల గిరిజన సమూహం (పీవీటీజీ) దిదాయ్ వర్గం అమ్మాయి చంపా రస్పెడను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శనివారం రాజ్ భవన్‌లో సత్కరించారు. మల్కన్‌గిరి జిల్లాలోని అమ్లిబేడ గ్రామానికి చెందిన చంపా, నీట్‌కు అర్హత సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందిన మొట్టమొదటి దిదాయ్ అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. ఆమె తన సోదరుడు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీ ఎస్టీ ఆర్టీఐ) అధికారి, ఆమె గురువు, ఉపాధ్యాయులు ఉత్కళ కేశరి దాస్‌తో కలిసి రాజ్ భవన్‌ను సందర్శించింది. ఆమెతో సంభాషణ సమయంలో గవర్నర్ ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, పాఠశాల విద్య, శిక్షణ మద్దతు, వైద్య వృత్తిని కొనసాగించాలనే సంకల్పం వంటి కోణాల్లో ఆమె ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు. చంపా సాధించిన విజయాన్ని డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రశంసిస్తూ ఆమె విజయం దిదాయ్ సమాజానికే కాకుండా సమగ్ర రాష్ట్రానికే గర్వకారణమన్నారు. మారుమూల గ్రామం నుంచి నీట్ పరీక్షకు అర్హత సాధించడానికి ఆమె ప్రయాణం అసాధారణమైన సంకల్పం, పట్టుదల, విద్య పట్ల బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చంపా ఉత్తీర్ణత గిరిజన, మారు మూల గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు శక్తివంతమైన ప్రేరణగా అడ్డంకులను అధిగమించడానికి దోహదపడి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వారిని ప్రేరేపిస్తుందన్నారు. చంపా రస్పెదా భావి విద్యా కార్యకలాపాలలో సాధ్యమైన అన్ని మద్దతులను అందజేస్తానని గవర్నర్ హామీ ఇచ్చి ప్రోత్సహించారు. ఆమె ఉత్తీర్ణత విద్యార్థులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని, సాధికారత మరియు సామాజిక పురోగతికి సాధనంగా విద్య యొక్క పరివర్తన శక్తిని నొక్కి చెబుతుందని కొనియాడారు.

దిదాయ్ బాలికకు గవర్నర్ సత్కారం