
దుష్ట సంప్రదాయానికి పరాకాష్ఠ
● జెడ్పీచైర్మన్ ప్లెక్సీలు చించివేసిన
దుండగులపై ఫిర్యాదు
బొబ్బిలి: పట్టణంలో కొత్త దుర్మార్గానికి తెరతీశారు గుర్తు తెలియని దుండగులు. ఇటీవల జెడ్పీ చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా బొబ్బిలి పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బ్లేడ్, చాకుతో కోసినట్టు చించేశారు. అభిమానంగా పెట్టుకున్న ఫ్లెక్సీలకు కూడా రాజకీయ దుర్భుద్ధితో ఇలా చించడం సరికాదంటూ చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సంప్రదాయం కొనసాగించే అవకాశం ఉందని దీనిని కొనసాగించకుండా అడ్డుకోవాలని ఆలోచించిన వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్ రామకృష్ణ, పాలవలస ఉమా శంకర్, ఇంటి గోవిందరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి దుండగులను గుర్తించాలని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.