
పిప్పిలి–కోణార్క్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌కు ప్రభుత్వం
● ప్రయాణ సమయం కుదింపు
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాత కోణార్క్ శిల్ప కళాఖండం పర్యటన ప్రాంతం సందర్శనకు అనుకూలమైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తరచూ పలు ఆహ్లాదకరమైన పథకాలు, కార్యక్రమాల్ని ప్రవేశ పెడుతున్నారు. ప్రధానంగా పూరీ పరిసర ప్రాంతాల నుంచి కోణార్క్ ప్రాంతానికి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఆకట్టుకునే ప్రయాణ మార్గాల అన్వేషణ విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన పూరీ–కోణార్కు మైరెన్ డ్రైవ్‌కు అనుబంధంగా పూరీ సమీప పిప్పిలి ప్రాంతం నంచి కోణార్క్ శిల్ప కళాక్షేత్రానికి హరిత ప్రాకార రహదారి (గ్రీన్‌ఫీల్డ్ కారిడార్) నిర్మాణం యోచనకు ప్రాథమిక ఆమోదం లభించడం విశేషం. యోచన ప్రకారం పథకం వాస్తవ కార్యాచరణకు నోచుకుంటే పిప్పిలి, కోణార్క్ ప్రాంతాల మధ్య ఒక గంటన్నర (90 నిముషాలు) ప్రయాణం నామ మాత్రంగా అర గంట (30 నిముషాలు)కు పరిమితం అవుతుంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పూరీ జిల్లాలో రోడ్డు అనుసంధానంపై ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, నిర్మాణ విభాగం మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ ఆమోదం వెల్లడించారు. ప్రతిపాదిత గ్రీనన్‌ఫీల్డ్ కారిడార్ 40 కిలో మీటర్ల పొడవు, 200 అడుగుల వెడల్పుతో సువిశాలంగా 4 అంచెల ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేస్తారు. ఈ సుదూర బాటలో వాహనాలు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోయేందుకు అనుకూలంగా నిర్మితం చేయాలని ప్రతిపాదించారు. అందుకు అవసరమైన డిజైన్ పనులు ఊపందకున్నాయి. అంచెలంచెలుగా ప్రాథమిక స్థాయి కార్యాచరణ పూర్తి కావడంతో అనుబంధ అనుమతులు పొందడంతో హరిత ప్రాకార రహదారి నిర్మాణానికి భూ సేకరణ ప్రారంభం అవుతుందని ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలిపారు.
సమీక్ష సమావేశంలో మరికొన్ని ప్రాజెక్టులపై చర్చించారు. పూరీ ప్రాంతంలో తాజ్ ఇంటర్నేషనల్ నుండి జగన్నాథ్ స్టేడియం వరకు ఉన్న రహదారిని 4 అంచెలుగా విస్తరించనున్నారు. చైతన్య రోడ్డు నుంచి బలిసాహి (జగన్నాథ్ ఆలయానికి అనుసంధాన బాట), డోలమండపం వీధి రోడ్డు మరియు ఝాడేశ్వరి క్లబ్, మెడికల్ ఛక్ మార్గం అనుసంధానం సర్వే ప్రక్రియకు ప్రణాళిక ఖరారు చేశారు. నిమాపడా నియోజక వర్గంలో చారి ఛొక్కొ నుండి అస్తరంగ్ వరకు 4 లేన్ల రహదారికి మరియు జలార్ పూర్ మరియు చారి ఛొక్కొ కలిపే మరొక రహదారికి ప్రణాళికలు ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టులు పూరీ జిల్లా అంతటా రహదారి అనుసంధానం గణనీయంగా పెంచుతాయని, పర్యాటకం, స్థానిక అభివృద్ధి రెండింటినీ పెంచుతాయని అధికారులు తెలిపారు.