
నవీన్ పట్నాయక్ ఢిల్లీ పర్యటన
● రాజకీయ ఊహాగానాలు
భువనేశ్వర్: బిజు జనతాదళ్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. 4 రోజుల పర్యటనకు వెళ్లినట్లు బిజూ జనతా దళ్ వర్గాల సమాచారం. నవీన్ పట్నాయక్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బీజేడీ వైఖరి పట్ల అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో బిజూ జనతా దళ్ అభిప్రాయం ఇంత వరకు బయటకు పొక్కలేదు. అంతిమ క్షణం వరకు కీలక అంశాలపై బీజేడీ అధినేత నిర్ణయం అత్యంత గోప్యంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బిజూ జనతా దళ్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయే పక్షాన లేదా విపక్ష కూటమి పక్షాన ఉంటుందోననే ఉత్కంఠ బిగుసుకుని ఉంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు పురస్కరించుకుని గతంలో బిజూ జనతా దళ్ పలు సందర్భాల్లో విభిన్న రీతుల్లో స్పందించింది. కొన్ని సందర్భాల్లో ఎన్నికకు దూరంగా ఉన్న దాఖలాలు లేకపోలేదు. తాజాగా జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలో బిజూ జనతా దళ్ అత్యంత వ్యూహాత్మకంగా ఖరారు కానుందని ప్రముఖుల అభిప్రాయం.
రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
ఢిల్లీకి బయల్దేరే ముందుగా నవీన్ పట్నాయక్ బీజేడీ రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ స్పందిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో బిజూ జనతా దళ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపి ప్రతి ఇంటి ముంగిటకు ప్రభుత్వ పాలన పోకడని చేరదీస్తుందన్నారు. ఈ దిశలో రాజకీయ వ్యవహారాల సమావేశం కొనసాగిందన్నారు. దీర్ఘ కాలం తర్వాత నవీన్ పట్నాయక్ రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా తారసపడ్డారు. ఇటీవల ఆయన అనారోగ్యం కారణంగా విరామంలో కొనసాగారు. భారత ఉప రాష్ట్రతి ఎన్నిక అతి చేరువలో ఉంది. మరో వైపు శాసన సభ వానా కాలం సమావేశాలు దగ్గరపడుతున్నాయి. ఈ సందర్భాల్లో విపక్ష హోదాలో బిజూ జనతా దళ్ వైఖరికి సాన పెట్టే వ్యూహంతో రాజకీయ వ్యవహారాల సమావేశం జరిగిందని రాజకీయ శిబిరాల్లో చర్చ చోటు చేసుకుంటుంది. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో, పీఏసీ సభ్యులు పార్టీ అధ్యక్షుడితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నవీన్ పట్నాయక్ తగిన సమయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. బీజేడీ ఇటీవల విద్యార్థి, యువత, మహిళా విభాగాాలను పునరుద్ధరించింది. ఆయా వర్గాల మధ్య సమన్వయం, వర్ధమాన రాజకీయ, సామాజిక స్థితిగతుల దృష్ట్యా కార్యశైలిని ఈ సమావేశంలో ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమారు 10 రోజుల్లో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసన సభ వానాకాలం సమావేశంలో లేవనెత్తాల్సిన కీలక అంశాలపై కూడా సభ్యులు చర్చించారు. మహిళలు, బలహీన వర్గాలపై పెరుగుతున్న దౌర్జన్యాలు, ఎరువుల కొరత, రథ యాత్ర సమయంలో నిర్వహణ లోపాలు వంటి కీలక అంశాల్ని సభలో ప్రస్తావించేందకు బీజేడీ సిద్ధం అవుతోంది.