
గుట్టుగా బాల్య వివాహాలు..!
విజయనగరం ఫోర్ట్: ఈఏడాది జనవరి నెలలో బొండపల్లి మండలంలో 16 ఏళ్ల బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని చైల్డ్‌లైన్ ట్రోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో చైల్డ్‌లైన్, బాలల సంరక్షణ, పోలీసులు సంబంధిత గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు.
అలాగే విజయనగరం మండలంలో 17 ఏళ్ల బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈవిషయాన్ని చైల్డ్ లైన్ ట్రోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో అధికారులు సంబంధిత గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు. ఈ రెండు చోట్లే కాదు. జిల్లాలో అనేక చోట్ల బాల్య వివాహాలు గుట్టుగా జరిగిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల దృష్టికి వచ్చినవి చాలా తక్కువే. అధికారుల దృష్టికి రాకుండా రహస్యంగా బాల్యవివాహాలు జరిగిపోతున్నట్లు సమాచారం. బాల్య వివాహాలకు అధికారులు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సమావేశం కాని కమిటీలు
బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బాల్యవివాహ నిషేధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి పంచాయతీ సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో బాల్య వివాహాల నిరోధక అధికారులుగా వ్యవహరిస్తారు. అయితే ఈ కమిటీ సమావేశాలు ఎక్కడా కానరావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్యవివాహం చేయడానికి అస్కారం ఉండే వారిని వీరు గుర్తించి వారిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అనాథ బాలికలు, ఇంట్లో వృద్ధాప్యం బారిన పడిన తాతయ్యలు, మామ్మలు ఉండేచోట బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి చోట్ల బాల్య వివాహాలు చేయకుండా వారికి అవగాహన కల్పించాలి. కాని ఎక్కడా ఈ చర్యలు కానరావడం లేదు.
10 మండలాల్లో ప్రయత్నాలు
జిల్లాలోని 10 మండలాల్లో బాల్యవివాహాలు చేయడానికి బాలికల తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ 10 మండలాల్లో జనవరి నెల నుంచి ఇప్పటివరకు అధికారులు 23 చోట్ల బాల్య వివాహాలను నిలుపుదల చేశారు.
నిలిపివేస్తామని చెప్పి వివాహాలు
అధికారుల సమక్షంలో బాల్య వివాహాన్ని నిలుపుదల చేసినట్లు ఇరువైపులా తల్లిదండ్రులు చెబుతున్నారు. లఖిత పూర్వకంగా రాసి ఇస్తున్నారు. అంతటితోనే అధికారులు ఆగిపోతున్నారు. తర్వాత వారు నిజంగానే బాల్య వివాహలు నిలుపుదల చేశారా? లేదా ఎక్కడైనా వివాహం చేసేశారా అని ఫాలోఅప్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల అధికారుల ముందు బాల్య వివాహం నిలుపుదల చేసిన తల్లిదండ్రులు మళ్లీ వివాహం జరిపించేస్తున్నారు.
రెండేళ్ల జైలు
బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చేసిన, ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదు చేసి రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి జైలు, జరిమానా విడివిడిగా పడే అవకాశం ఉంది.
ఈఏడాది 23 నిలుపుదల
గ్రామాల్లో కానరాని నిషేధ కమిటీ
సమావేశాలు
అనధికారికంగా అధిక సంఖ్యలో జరిగిపోతున్నట్లు ఆరోపణలు

గుట్టుగా బాల్య వివాహాలు..!