
పిల్లలకు పెద్దలే మార్గదర్శకులు: సీఎం
● ఘనంగా రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం
● ముఖ్యమంత్రి విద్యా అవార్డు ప్రదానోత్సవం
భువనేశ్వర్:
వర్ధమాన సమాజంలో వివిధ రంగాలలో అవకాశాలు అపరిమితంగా ఉన్నాయని, పిల్లలలో ఇమిడి ఉన్న అపార ప్రతిభను గుర్తించి పెద్దలు వారి కలల సాకారానికి మార్గదర్శకులు కావాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం, ముఖ్యమంత్రి విద్యా అవార్డు ప్రదానోత్సవంలో పిలుపునిచ్చారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ రాష్ట్ర స్థాయి వేడుకలో గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శ ఉపాధ్యాయుడు, మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు.
నేటి విద్యా వ్యవస్థలో రెండు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవాలని, మొదటిది డ్రాపౌట్ రేటు నివారించడం, రెండోది అందరికీ నాణ్యమైన విద్య అందించడం అని సీఎం అన్నారు. డ్రాపౌట్ రేటును నియంత్రణలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతమైన చర్యగా నిలిచిందన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పౌష్టిక ఆహారంతో మధ్యా హ్న భోజన పథకాన్ని పదో తరగతి వరకు విస్తరించారని, షెడ్యూల్డ్ కులం, తెగల వర్గానికి చెందిన పిల్లలకు మాధో సింగ్ దివ్యాంగుల వ్యయ పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు.. రానున్న రోజుల్లో డ్రాపౌట్ రేటును తగ్గించడంలో ఈ పథకాలన్నీ ఖచ్చితంగా విజయవంతమవుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కొత్త విద్యా విధానం అమలు చేసినట్లు తెలిపారు.
2036 నాటికి సంపన్న ఒడిశా నిర్మాణంలో ప్రస్తుత విద్యార్థుల ప్రతిభ ఆవిష్కరణ బలమైన పునాదిగా నిలుస్తుందని, పిల్లలను ఎలా నడిపించాలో, వారిని మంచి మనుషులుగా ఎలా తయారు చేయాలో ఉపాధ్యాయులకు బాగా తెలుసని అన్నారు. ఉపాధ్యాయుల అంకిత భావ కార్యాచరణ ఒడిశా ఆవిర్భావ శత జయంతి నాటికి సుసంపన్న ఒడిశా ఆవిష్కరణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి విద్యా అవార్డు కార్యక్రమంలో విద్యా రంగంలో అద్భుత ప్రదర్శనకు మొదటి స్థానంలో నిలిచిన ఝార్సుగూడ జిల్లాకు రూ. 3 కోట్లు, రెండవ స్థానంలో నిలిచిన ఖుర్దా జిల్లాకు రూ.2 కోట్లు, జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు రూ.కోటి బహుమతిని ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా 70 మంది ఉపాధ్యాయులను, 3 జిల్లా విద్యా శిక్షణ సంస్థలను, ముగ్గురు జిల్లా విద్యా అధికారులకు, 10 మంది మండల విద్యా అధికారులకు ముఖ్యమంత్రి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నీట్ పరీక్షలో రాణించిన షెడ్యూల్డ్ తెగ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో జాతీయ విద్యా విధానం ఆధారంగా ఒడిశా కరికులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ – 2025 అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి పురస్కరించుకుని పొఢిబా, గొఢిబా ఒడిశా ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద్ గోండ్ గురు – శిష్య సంప్రదాయం మన సమాజంలో పురాతన కాలం నుండి సుదృఢంగా కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, ఆదర్శ సమాజ నిర్మాణం తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్రధారులు కావాలన్నారు. ఉత్తమ జిల్లా అవార్డు ఝార్సుగుడ, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్, జిల్లా విద్యా అధికారులు సోన్‌పూర్ – లక్ష్మణ్ భోయ్, సుందరగడ్– అమూల్య నాయక్, బొలంగీరు– ధృబ చరణ్ బెహెరా, జిల్లా విద్య మరియు శిక్షణ సంస్థ అవార్డు ఢెంకనాల్, జగత్‌సింగ్‌పూర్, అంగుల్ అందుకున్నారు.

పిల్లలకు పెద్దలే మార్గదర్శకులు: సీఎం