భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి 4 రోజుల కొత్త ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో స్వల్ప అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌కు బయల్దేరిన విమానం భారీ వర్షం కారణంగా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగలేకపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం కోల్‌కతాకు తరలించారు. కోల్‌కతా మీదుగా సుమారు 3 గంటల ఆలస్యంగా భువనేశ్వర్‌కు ముఖ్యమంత్రి సురక్షితంగా చేరారు.
బసంత్ కుమార్‌కు అవార్డు ప్రదానం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బసంత్ కుమార్ రణా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు. దీంతో ఆయనకు ఢిల్లీలో శుక్రవారం జరిగిన టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతిముర్ము అవార్డును ప్రదానం చేశారు. రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేసి సత్కరించారు. కాగా బసంత్ కుమార్ రణాకు జాతీయస్థాయి అవార్డు రావడంతో జిల్లాలో ఆయన చేసిన సేవలను జిల్లా విధ్యాధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి కొనియాడారు.
ప్రమాద సంకేతం దాటిన జలకా నది నీటి మట్టం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లాలో జలకా నది నీటి మట్టం గణనీయంగా పెరిగింది. బొస్తా ప్రాంతం మథాని సమీపంలో ప్రమాద సంకేతం అధిగమించి వరద నీరు ఉప్పొంగుతోంది. ఈ నది ప్రమాద సంకేతం 6.50 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 6.71 మీటర్లు కొనసాగుతోంది. బొస్తా మండలంలో 10 పంచాయతీలు ప్రభావితం అయ్యాయి.
పారాదీప్ ఓడ రేవులో
ఒకరు గల్లంతు
భువనేశ్వర్: జగత్‌సింగ్‌పూర్ జిల్లా పారాదీప్ ఓడరేవు వద్ద శుక్రవారం ఉదయం దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రమాదవశాత్తు ఇద్దరు సిబ్బంది ఓడ నుంచి జారి సముద్రంలో మునిగి పోయారు. వారిలో ఒకరు గల్లంతయ్యారు. మరో వ్యక్తిని తక్షణమే గాలించి ఒడ్డుకు చేర్చారు. ఓడ రేవు 5వ నంబర్ గేటు సమీపంలోని పీఐసీటీ బెర్త్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఓడ బెర్త్ నుంచి బయల్దేరిన తర్వాత సిబ్బంది నిచ్చెనను తొలగిస్తుండగా దురదృష్టవశాత్తు పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత, వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే ఒకరిని రక్షించారు. ఓడ నుంచి పడిపోయిన మరొక సిబ్బంది జాడ కోసం గాలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఐఎస్‌ఎఫ్, మైరెన్ ఠాణా పోలీసులు, స్కూబా డైవర్లు, కోస్ట్ గార్డ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.
కాలువలో కొట్టుకుపోయిన బాలుడు మృతి
భువనేశ్వర్: నగరం శివార్లలోని దారుఠెంగొ గ్రామం సమీపం కాలువలో ఒక బాలుడు కొట్టుకుపోయాడు. ఎనిమిది మంది తోటి విద్యార్థులలో కలిసి స్నానం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందడంతో అగ్ని మాపక దళం కాలువలో దూకి గల్లంతైన బాలుని కోసం గాలించింది. దాదాపు గంటసేపు నిర్విరామంగా గాలించి అపస్మారక స్థితిలో ఉన్న బాలుని ఒడ్డుకు చేర్చారు. తక్షణమే చికిత్స కోసం చేరువలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి రాకలో ఆలస్యం
ముఖ్యమంత్రి రాకలో ఆలస్యం