
రాష్ట్రంలో హెలీపోర్ట్‌లను ఏర్పాటు చేయాలి: గవర్నర్
భువనేశ్వర్: రాష్ట్రంలో రెండు, మూడు ప్రదేశాల్లో హెలిపోర్ట్‌లను ఏర్పాటు చేయాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ప్రాతిపదికన ఈ చర్యకు నడుం బిగించాలని ప్రోత్సహించారు. రాష్ట్ర యాజమాన్యంలోని ఎయిర్‌స్ట్రిప్‌లలో రన్‌వేలను విస్తరించి పెద్ద విమాన కార్యకలాపాలను సులభతరం చేయాలన్నారు. రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్‌లో రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), రైల్వే, విమానయాన ప్రాజెక్టుల స్థితిగతులపై జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా గవర్నర్ ఈ ప్రతిపాదన చేశారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాల రవాణా విస్తరణ వ్యవస్థని సమీక్షించారు.
హెలిపోర్ట్‌లను ప్రవేశపెడితే ప్రయాణ వ్యయ ప్రయాసల్ని కుదించి సాధారణ ప్రజలకు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యంగా విస్తృత ఆదరణ పొందుతాయన్నారు. ప్రధానంగా రోడ్డు మార్గంలో పలు ప్రాంతాల ప్రయాణానికి 6 నుండి 8 గంటలు పట్టే ప్రదేశాల్లో హెలిపోర్టుల ఏర్పాటు ఉభయతారకంగా ఉంటుందని వివరించారు. ఒడిశా పర్యాటక రంగం సామర్థ్యం పెంపొందించేందుకు ఓడ రేవులలో క్రూయిజ్ టెర్మినల్‌ల అభివృద్ధి దోహదపడుతుందన్నారు. అలాంటి విధానం సమయాన్ని ఆదా చేస్తుందని, క్రూయిజ్ షిప్‌లను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధి పరిరక్షణ కోసం ఓడ రేవులలో ఫిషింగ్ జెట్టీలను చేర్చాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. ఛొతియా లో పైలట్ల డ్రైవింగ్ శిక్షణ సంస్థ ప్రేరణతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, ఐటీఐలలో డ్రైవింగ్ శిక్షణ కోర్సులను ప్రవేశ పెట్టి దేశ, విదేశాల్లో విద్యార్థుల ఉపాధి వనరుల మెరుగుదల పట్ల దృష్టి సారించాలన్నారు.
రైల్వే ప్రాజెక్టులను సమీక్షించిన గవర్నర్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధితో తదనంతర పురోగతి గురించి ఆరా తీశారు. ఈ కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అవసరమని రైల్వే అధికారులకు సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్వహణ, విస్తరణ కార్యకలాపాల్ని ప్రతిబింబించే రీతిలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు తదితర సౌకర్యాలు వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలకు ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేలు, విమానయాన విభాగాల్లో తలెత్తే సమస్యలను సకాలంలో పరిష్కరించి త్వరితగతిన అమలు చేయడం కోసం విభాగాల మధ్య మెరుగైన సమన్వయం కొనసాగించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, వాణిజ్యం మరియు రవాణా విభాగం మంత్రి బిభూతి భూషణ్ జెనా, తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి వీరేంద్ర సింగ్, అటవీ, పర్యావరణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక సహాయ కమిషనర్, వాణిజ్య–రవాణా శాఖ ప్రఽముఖ కార్యదర్శి, నిర్మాణ శాఖ ప్రఽముఖ కార్యదర్శి, గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషణ్ సాహు తదితర అనుబంధ శాఖలు, విభాగాల పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.