
చోరీలకు యత్నించిన ఐదుగురు అరెస్టు
జయపురం: పట్టణంలో ధనవంతుల ఇళ్లను, దారిన పోయే వాహనదారులను దోచుకొనేందుకు సన్నద్ధమవుతున్న ఐదుగురు దుండగులను జయపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు పెద్ద కత్తులు, ఒక ఇనుప రాడ్డు, కారంపొడి, టార్చ్‌లైట్లు, మూడు మోటారుబైక్‌లు సీజ్ చేసినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంధ్ర రౌత్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం రాత్రి పట్టణ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ సిద్ధాంత కుమార్ బెహర నేతృత్వంలో ఏఎస్‌ఐ లు డి.పిపండా, ఎస్.బి.నాయక్, పోలీసులు మోహన పాత్రో,ఎ.నాయిక్, ఒడిశా ఆర్మడ్ పోలీసు ఎల్.ప్రధాన్,ఎస్.ముదులిలు పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో జయనగర్ సమీప భూతనాద్ మందిరంలో కొంతమంది వ్యక్తులు దోపిడీలు, దొంగతనాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వారి వద్ద మారణాయుదాలు ఉన్నట్లు విశ్వాసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసు అధికారి వెల్లడించారు. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకొని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. అరెస్టయిన వారిలో జయపురం గోపబందునగర్ వాసి శివ సున, ఒడియ మేదరి వీధికి చెందిన సునీల్ పొరజ ఉరఫ్ లల్లు, జయనగర్ వాసి సురేష్ హరిజన్, ఒడియా మేదరి వీధికి చెందిన హరి నాయిక్, ప్రసాదరావుపేట వాసి టి.మణికంఠ, జముణగుడ వాసి కార్తీక కుడ ఉన్నట్టు వివరించారు.