
ఊహాగానాలు
మంత్రి మండలి విస్తరణపై..
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రి మండలి విస్తరణ శుభ ఘడియల కోసం పలువురు ఆశావాదులు ఉవ్విళ్లూరుతున్నారు. మన్మోహన్ సామల్ మరో మారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి మంత్రి మండలి విస్తరణపై ఉత్కంఠ బిగుసుకుంది. రాష్ట్రంలో తొలి సారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మన్మోహన్ సామల్ కీలక పాత్ర పోషించి అధిష్టానం మన్ననలు పొందారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఆయన దక్షతని ప్రత్యక్షంగా చాటుకున్నారు. బీజేపీ ఏడాది పాలన కాలంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏడాది పాలనలో ఒడిదొడుకుల్ని సవరిస్తూ ప్రభుత్వంలో, సొంత పార్టీలో లుకలుకల్ని పరిష్కరించిన అనుభవజ్ఞుడిగా మంత్రి మండలి విస్తరణకు వ్యూహాత్మకంగా రూపొందిస్తారనే నమ్మకం సర్వత్రా నెలకొని ఉంది.
వాస్తవానికి మోహన్ చరణ్ మాఝి కొలువులో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పలువురికి బహుళ శాఖలు కేటాయించారు. బాధ్యతల ఒత్తిళ్లతో కొన్ని శాఖల పని తీరు సంతృప్తికరంగా కొనసాగడం లేదు. కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారి నుంచి బహుళ శాఖల బాధ్యతల్ని తొలగించి పాలన దక్షతనకు పదును పెట్టి రాష్ట్ర బహుముఖాభివృద్ధికి నడుం బిగించాల్సిన సమయంలో స్ఫూర్తిదాయకమైన మంత్రి వర్గాన్ని మన్మోహన్ సామల్ ఆవిష్కరిస్తారని సర్వత్రా చర్చ సాగతుంది.
మరో వైపు మంత్రులుగా శాఖల కార్యాచరణ, అనబంధ పురోగతి నామ మాత్రంగా కొనసాగుతున్న వారి వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఏడాది పాలనలో సంతృప్తికరమైన పురోగతి లేని శాఖల్లో అమాత్యుల మార్పు అనివార్యం అనిపిస్తోంది. పాత ముఖాల్ని తొలగించి ప్రభుత్వ ఆశయాల వాస్తవ కార్యాచరణ పట్ల అంకిత భావంతో ఔత్సాహికంగా ముందుకు వస్తున్న వారిలో కొంత మందికి విస్తరణలో చోటు ప్రసాదించేందుకు అనుకూలత నెలకొని ఉంది.
బీజేపీ ఏడాది స్వల్ప వ్యవధి పాలనలో ఆరోగ్య, న్యాయ శాఖలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానంగా పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర నిర్వహణ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఏడాది వ్యవధిలో వరుసగా 2 సార్లు నిర్వహించిన జగన్నాథుని రథ యాత్రలో పలు అపశృతులు చోటు చేసుకున్నాయి. శ్రీ మందిరానికి భద్రత లోపించిది. స్వామి భక్తులకు రక్షణ కొరవడిందనే ఆరోపణలు రాష్ట్రేతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇలాంటి అవమానకర పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని మంత్రి మండలి సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సి ఉందని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.
ఖాళీ స్థానాల భర్తీపై ఉత్సాహం ఉరకలేస్తుండగా ఉద్వాసనకు చేరువలో ఉన్న వారికి గుండె దడ పెరుగుతోంది. ఇటీవల ఏడాది పాలన పూర్తి పురస్కరించుకుని పలు శాఖలు, మంత్రుల పని తీరు, పురోగతి వగైరా సమాచారం ముందస్తుగా సేకరించి విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఆధారంగా పలు శాఖల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం తథ్యం. మంత్రి వర్గ విస్తరణ, కొత్త వారికి పదవుల కేటాయింపు విషయాల్లో ప్రభావ వంతుల ప్రమేయానికి కళ్లెం పడుతుందని మన్మోహన్ సామల్ సన్నిహిత వర్గాల భోగట్టా. అధికార పార్టీ పరువు, ప్రతిష్టల్ని వీధికి ఈడ్చిన సంఘటనల తెర వెనక ప్రముఖుల చొరవకు అడ్డుకట్ట వేసి వికసిత్ ఒడిశా ఆశయ సాధనకు సానుకూల మంత్రి మండలి ఏర్పాటుకు మార్గం సుగమం చేసే యోచన తుది మెరుగులు దిద్దుకుంటుది.
లింగ, కులం, ప్రాంతీయ ప్రాతిపదికన మంత్రి మండలిలో స్థానం కల్పించే సమీకరణాలపై గణాంకాలు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ, విద్యాధిక్యత, వ్యూహాత్మక సమన్వయం ప్రామాణికలతో మహిళలు ఇతర వర్గాలకు పట్టం గట్టే అవకాశం ఉంది. అన్ని లోక్ సభ నియోజక వర్గాల నుండి రాష్ట్ర మంత్రి మండలి ప్రాతినిధ్యంపై దష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
సిట్టింగులకు గుండె దడ
కొత్తవారిలో ఉత్సాహం
బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన పలు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అకాడమీలు, కమిషన్లు వగైరా సభ్యుల నియామకం నోచుకోలేదు. మంత్రి మండలి విస్తరణతో ఆయా పదవుల్ని భర్తీ చేస్తారని భావిస్తున్నారు. పార్టీ అంతర్గత పోటీ ప్రభావంతో ఈ పదవుల భర్తీలో జాప్యం చోటు చేసుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి యథాతథం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి యథాతథంగా కొనసాగుతారని ఇటీవల ఒక సందర్భంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. ఈ ప్రకటన వీరివురి మధ్య సమన్వయం, సమభావన యోచనల్ని ప్రతిబింబిస్తుంది. రథ యాత్రలో గందరగోళం, భువనేశ్వర్ నగర పాలక సంస్థ అధికారిపై దాడి వంటి సంఘటనల వెనక ప్రభావవంతమైన గ్రూపు నాయకులను పక్కన పెట్టి అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంత్రి మండలి విస్తరణ, ప్రభుత్వ రంగ సంస్థల సభ్యుల నియామకంలో ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. మోహన్ చరణ్ మాఝికి ముఖ్యమంత్రిగా పట్టం గట్టడంతో ఆది నుంచి ఒక వర్గం సమస్యాత్మక పరిస్థితుల్ని ప్రేరేపించి అవాంఛనీయ అలజడి రేపుతున్నట్లు సాగుతున్న ప్రచారంపై పార్టీ అధిష్టానం దృష్టిని కేంద్రీకరించింది.