
● నాగలికి ప్రేమికులను కట్టి..
రాయగడ: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ విషయం బయటకు పొక్కింది.
వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లక సరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు.