
ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి
భువనేశ్వర్: రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా శాసనసభ నుంచి పార్లమెంటు వరకు సుదీర్ఘ కాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన కేంద్రమంత్రి జుయెల్ ఓరాం ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు శనివారం ప్రకటించారు. సంబలపూర్ గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సుందరగడ్ పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర దళిత వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. సంబల్‌పూర్‌లో జరిగిన జాబ్‌మేళాలో ఈ ప్రకటన చేశారు. పోటీ నుంచి వైదొలగి యువతకు అవకాశం కల్పించాలనే దృక్పథంతో ఈ యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వరుసగా 6 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 2 సార్లు రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహించగలిగినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైనా పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత వ్యవహారాల్లో చివరివరకు అంకిత భావంతో సేవలందించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
రాజకీయ వర్గాల్లో ఉలికిపాటు
రాష్ట్ర ప్రజాప్రతినిధుల్లో పార్టీలకు అతీతంగా జుయెల్ ఓరాం సీనియర్ గిరిజన రాజకీయ నాయకుడు కావడం విశేషం. తాను ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాలను ఉలికిపాటుకు గురి చేసింది. ప్రస్తుతం ఆయన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహంచిన 6 పర్యాయాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రాతినిథ్య రంగంలో జుయెల్ ఓరం 3 దశాబ్ధాలు పైబడి తిరుగులేని నాయకుడిగా కొనసాగుతు పలు మైలురాళ్లని అధిగమించారు. రాష్ట్ర శాసనసభకు 1990, 1998 ఎన్నికల్లో పోటీ చేసి విజేతగా నిలిచారు. అలాగే సుందర్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా 6 సార్లు ఎన్నిక కావడం విశేషం. 1999 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వరుసగా 3 సార్లు బాధ్యతలు నిర్వహించారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా ఒక పర్యాయం కొనసాగారు. పలు కీలకమైన సంస్థాగత పదవులు, హోదాల్లో తనదైన ఉనికిని బలంగా చాటుకున్నారు.
కేంద్రమంత్రి జుయెల్ ఓరాం