
విద్యాసంస్థల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్లు
భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని ఆత్మాహుతి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యాసంస్థల ప్రాంగణాల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది భద్రత, రక్షణ పట్ల కార్యాచరణ కట్టుదిట్టం చేసింది. ప్రధానంగా విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, మహిళా సిబ్బంది పట్ల లైంగిక వేధింపులు వంటి ఘటనలకు తావు లేకుండా రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ కార్యదర్శి షాలిని పండిట్ అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేశారు.విధుల నిర్వహణ ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం, 2013ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యా సంస్థలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీలు) కార్యాచరణ చురుకుగా కొనసాగాలని, క్రమం తప్పకుండా ఫిర్యాదుల్ని సమీక్షించి సకాలంలో తగిన చర్యలు పట్ల స్పందించచాలని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికల విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ కదలిక పట్ల దృష్టి సారించి, పాఠశాలల్లో సురక్షితమైన సమగ్ర సహాయక వాతావరణం నెలకొల్పాలని సూచించారు. విద్యార్థుల్లో లైంగిక ఆధారిత హింస నివారణకు సామాజిక శాస్త్ర పాఠ్యాంశాలతో అనుసంధానించబడిన అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో బర్నాలి (లింగ సమానత్వ కార్యక్రమం)ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
హెల్ప్‌లైన్ ప్రదర్శన తప్పనిసరి..
విద్యా సంస్థల ప్రాంగణాల్లో సత్వర స్పందనకు అవసరమైన హెల్ప్‌లైన్ నంబర్‌ల ప్రదర్శన తప్పనిసరి చేసి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, అనుబంధ ప్రాంగణాల్లో హెల్ప్‌లైన్ నంబర్(మహిళా హెల్ప్‌లైన్ – 181, చైల్డ్ హెల్ప్‌లైన్ – 1098, పోలీస్ హెల్ప్‌లైన్– 112, పాఠశాల విద్యార్థి హెల్ప్‌లైన్ – 18003456722)లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది.