
కలప దుంగలు తరలిస్తున్న ట్రక్కు పట్టివేత
● డ్రైవర్ అరెస్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ అటవీ సిబ్బంది కలప దుంగలను అక్రమంగా తరలిస్తున్న ట్రక్కును పట్టుకున్నారు. ట్రక్కు డ్రైవర్ టికేశ్వర కుమార్ సాహును అరెస్టు చేసినట్లు అటవీ విభాగ అధికారి సందీప్ కుమార్ పాణిగ్రహి గురువారం వెల్లడించారు. ట్రక్కులో తీసుకెళ్తున్న 16 విలువైన కలప దుంగలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. బొయిపరిగుడ సమితి దసమంతపూర్ అటవీ ప్రాంతం నుంచి ఒక ట్రక్కులో కలప అక్రమంగా తీసుకుపోతున్న సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా అందిందన్నారు. వెంటనే దసమంతపూర్ ఫారెస్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని పంపించి ట్రక్కును అడ్డుకొని కలప సీజ్ చేసినట్లు వివరించారు. కలప ఉన్న ట్రక్కును అటవీ విభాగ కార్యాలయానికి తీసుకు వచ్చామన్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.