
నకిలీ విదేశీ మద్యం పట్టివేత
జయపురం: కొరాపుట్ జిల్లాలో దేశీయ సారా, కల్తీ విదేశీ మద్యం వరదలై పారుతోంది. కొరాపుట్ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షిత తాగునీరు లభించటం లేదుగాని నాటుసారా, కల్తీ విదేశీ మద్యం లభించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. అబ్కారీ సిబ్బంది ఎన్ని దాడులు జరిపి ఎంత మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టుతున్నప్పటికీ అక్రమ మద్యం వ్యాపారం ఆగడం లేదు. ఈ పరిస్థితిలో కొరాపుట్ జిల్లా అబ్కారీ ఉన్నతాధికారి అరుణ కుమార్ పాఢీ సారా ప్రవాహాన్ని అరికట్టాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఉన్నతాధికారి ఆదేశంతో నందపూర్ అబ్కారీ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ రథ్ నేతృత్వంలో జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ అబ్కారీ అధికారి భగవాన్ మహానందియ అతని సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నాటు సారా, సొలప కల్లుతో పాటు కల్తీ విదేశీ మద్యం, బీరులను పట్టుకున్నట్లు బొయిపరిగుడ అబ్కారీ అధికారి భగవాన్ మహా నందియ శుక్రవారం వెల్లడించారు. టీమ్ బొయిపరిగుడ సమితి చంద్రగండిగుడ బాలిగాం గ్రామా ల ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నకిలీ విదేశీ మద్యం అమ్ముతున్నారని సమాచారం అందడంతో వెంటనే తాము చంద్రషుండిగుడ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో లుకునాథ్ బిశాయి ఇంటిపై దాడి చేయడంతో అమ్మేందుకు ఉంచబడిన 2.160 లీటర్ల నకిలీ విదేశీ మద్యంతో పాటు 6.600 లీటర్ల నకిలీ బీర్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ గ్రామంలో బినోద్ బిశాయి ఇంటిపై దాడి జరిపి 30 లీటర్ల సొలప కల్లు, తొమ్మిది లీటర్ల నాటు సారా సీజ్ చేసినట్లు వెల్లడించారు. వాటితో పాటు బలిగాం గ్రామం సుభాష్ డాకువ ఇంట్లో దాచి ఉంచిన 2.340 లీటర్ల నకిలీ విదేశీ మద్యంతో పాటు 25.650 లీటర్ల బీర్‌లను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనలలో నలుగురిని అరెస్టు చేసినట్లు అబ్కారీ అధికారి భగవాన్ మహానందియ వెల్లడించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
నలుగురి అరెస్టు