పూరీ శ్రీమందిరంపై డ్రోన్
భువనేశ్వర్: పూరీ శ్రీమందిర్ లోపలి ప్రాంగణం, ఆలయ శిఖరం పైన జరుగుతున్న ఆచారాల స్పష్టమైన వైమానిక దృశ్యాలతో వీడియో సోషల్ మీడియాలో ప్రసారమైంది. ఇది డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. కట్టుదిట్టమైన ఆంక్షలు ఉన్నప్పటికీ, పూరీలోని పవిత్ర జగన్నాథ ఆలయ శిఖరంపై డ్రోన్ సంచారం భద్రతా యంత్రాంగం పని తీరును నిలదీస్తుంది. గత నెల 30న స్టోరీ బై నారు గోపాల్ అనే శీర్షికతో సాంఘిక ప్రసార మాధ్యమ వేదిక ద్వారా వీడియో ప్రసారం అవుతోంది. దీనిలో ఒక ఆలయ సేవకుడు ఆలయం పైభాగంలో సంప్రదాయ పతాక సేవ కోసం సన్నద్ధం అవుతున్న దశలో నమస్కార భంగిమలో స్పష్టంగా ప్రసారం అవుతుంది. నిత్యం ధ్వజారోహణ సేవని చున్నార్ వర్గం సేవకులు నిర్వహిస్తారు. వివాదాస్పద సాంఘిక మాధ్యమం ప్రసారంతో ఈ వర్గం సేవకుల చిత్త శుద్ధి వైపు వేలెత్తి చూపుతున్నారు. జగన్నాథ సంప్రదాయంలో ధ్వజారోహణ సేవ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది దైనందిన ఆచారం. ఈ సేవలో భాగంగా ఆలయ శిఖరాన నీల చక్రం ఆవరణలో పతిత పావన పతాకం కట్టే అపురూప క్షణాల దృశ్యాల్ని ఈ వీడియో ప్రసారం చేస్తుంది. భద్రత, మతపరమైన సున్నితత్వం, అనధికారిక నిఘా ప్రమాదం దృష్ట్యా శ్రీ జగన్నాథ ఆలయంపై డ్రోన్‌ల వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయ శిఖరంపై సేవల శైలిని బహిరంగంగా చిత్రీకరించి, సామాజిక వేదికలలో ప్రసారం చేయడం పర్యవేక్షణ, అమలులో స్పష్టమైన లోపాన్ని బహిర్గతం చేస్తుంది. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ ఈ ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది డ్రోన్ వాడకం నిషేధం పరిమితుల ఉల్లంఘనగా వ్యాఖ్యానించారు. ఈ ప్రసారంతో అనేక లొసుగులు, భద్రతా లోపాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి చొరబాట్లను అరికట్టడానికి శ్రీ మందిర్, చుట్టుపక్కల డ్రోన్ నిరోధక సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. వైరల్ వీడియో పూర్వాపరాలపై ఆరా తీసి డ్రోన్‌ను నిర్వహించడంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడంలో అనుబంధ అధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై స్వామి భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


