● మూడేళ్లలో 5.92 లక్షల పైబడి ప్రధాన నేరాలు ● భువనేశ్వర్ యూపీడీలో 250కి పైగా క్రిమినల్ కేసులు
భువనేశ్వర్: రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శాసన సభలో సోమ వారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 10 ప్రధాన నేరాల కేటగిరీల కింద మొత్తం 5,92,257 కేసులు నమోదైనట్లు ముఖ్య మంత్రి తెలిపారు. రౌర్కెలా ఎమ్మెల్యే శారద ప్రసాద్ నాయక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హత్య, దోపిడీ, దొంగతనం, మోసం, అల్లర్లు, అత్యాచారం, మోటారు వాహన ప్రమాదాలు వంటి 10 ప్రధాన నేర వర్గాలుగా పేర్కొన్నారు. ఈ వర్గాల కింద పెరుగుతున్న నేరాల రేటును పరిష్కరించడానికి ఒడిశా పోలీసులు అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు ముఖ్యమంత్రి సభలో వివరించారు.
అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ (ఈఆర్‌ఎస్‌ఎస్)
రాత్రింబవళ్లు పని చేసే టోల్ ఫ్రీ నంబర్ 112 కు డయల్ చేయడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో సత్వర సేవల్ని అందజేసేందుకు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. నేర దర్యాప్తు వ్యవస్థని సమర్థం చేశామని, కటక్‌లోని రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్‌లోని దర్యాప్తు సహాయ విభాగం సమర్థవంతమైన నేర దర్యాప్తుల కోసం జూమ్ మరియు గూగుల్ మీట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం విశేషంగా పేర్కొన్నారు.
లింగ ఆధారిత హింస నివారణ
లింగ ఆధారిత హింసను నివారించడానికి సంపర్క్ టోల్–ఫ్రీ నంబర్ 1800–4191–831 ప్రవేశపెట్టారు. అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 633 పోలీస్ స్టేషన్లలో మహిళలు మరియు పిల్లల డెస్క్‌లు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. భువనేశ్వర్ అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ (యూపీడీ)లో గత 9 నెలల్లో 285 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. వీటిలో 52 హత్యలు, 97 అత్యాచారాలు, 10 వరకట్న హత్య కేసులు, 1 వరకట్న ఆత్మహత్య కేసు, 37 వరకట్న హింస కేసులు, 44 వరకట్నయేతర హింస కేసులు, 42 మైనర్ బాలికల అత్యాచార కేసులు, 2 సామూహిక అత్యాచార కేసులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖరియార్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మాఝి ఈ వివరాల్ని సభలో ప్రవేశ పెట్టారు.