కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఆక్రమణలు తగవని సీపీఎం నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీ ఎగువ శెంబి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా సాలూరు మండల సీపీఎం కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు పర్యటించారు. ఒడిశా ప్రభుత్వం తరఫున గనుల తవ్వకాల కోసం రాళ్లు పాతారని గుర్తు చేశారు. ఈ విషయం పై ఇటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి సంధ్యారాణి కూడా మౌనం వహిస్తున్నారన్నారు. వివాదాస్పద ఆ ప్రాంతం లో సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయన్నారు. అంతేకాక ఐదో షెడ్యూల్ ప్రాంతం కనుక గిరిజనులకే సర్వ హక్కులు ఉన్నాయన్నారు. ఇక్కడ సరిహద్దు రాళ్లు వేసి గనులు తవ్వకాల కోసం ప్రారంభ పూజలు చేసిన చిత్రాలు శ్రీనివాసరావు విడుదల చేశారు.