ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత, సౌకర్యవంతమైన దర్శనం, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఆయన మోడల్ గెస్‌హౌస్‌లో ఉన్న కమాండింగ్ కంట్రోల్ రూమ్‌లో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంకేతిక అంశాలను పరిశీలించారు. దేవస్థానం రూపొందించిన దసరా–2026 ఐటీ ఏర్పాట్లలో భాగంగా దర్శన క్యూలైన్ల నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఘాట్ రోడ్ల వరకు వివిధ సాంకేతిక వ్యవస్థలను వినియోగించే విధానాలను రూపొందించారు. భక్తుల రాకపోకలను పర్యవేక్షించడం, రద్దీని అంచనా వేయడం, వాహనాల ప్రవేశాన్ని నియంత్రించడం, తప్పిపోయిన పిల్లల ఆచూకీ గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞానం సహాయకారిగా నిలవనుందన్నారు. క్యూలైన్లలో రద్దీ పరిస్థితులను అంచనా వేయడానికి కెమెరా ఆధారిత దర్శన సమయ అంచనా వ్యవస్థ రూపొందించారన్నారు. రద్దీని ఒకేసారి క్యూలైన్లలోకి అనుమతించకుండా క్రమబద్ధీకరించేందుకు ఏఐ ఆధారిత స్మార్ట్ హోల్డింగ్ ఏరియా మానిటరింగ్, బ్లాక్ రిలీజ్ వ్యవస్థ కీలకమైన ఏర్పాటు. హోల్డింగ్ ప్రాంతాలను బ్లాక్‌లుగా విభజించి, ప్రతి బ్లాక్‌లోని రద్దీ స్థితిని డిజిటల్ డిస్‌ప్లేల ద్వారా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లల భద్రతకు క్యూఆర్ కోడ్ రిస్ట్‌బ్యాండ్లును వేస్తున్నామన్నారు. ఘాట్ రోడ్లపై ఏఎన్‌పీఆర్ కెమెరాలు.. వాహనాల ప్రవేశంపై నిఘా పెట్టినట్లు చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించడం, పార్కింగ్ వినియోగాన్ని పర్యవేక్షించడం, వాహనాల రద్దీని తగ్గించడం కోసం కొత్త సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. భక్తుల అభిప్రాయాల సేకరణకు క్యూఆర్, ఐవీఆర్ వ్యవస్థలను వినియోగిస్తున్నామన్నారు. పరిశుభ్రతకు స్మార్ట్ గార్బేజ్ అలర్ట్ వ్యవస్థను వాడుతున్నామన్నారు.


